‘రిమోట్‌ కంట్రోల్‌’ విమర్శలపై రాహుల్‌ గాంధీ కౌంటర్‌

8 Oct, 2022 21:14 IST|Sakshi

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారు ఎవరైనా ‘రిమోట్‌ కంట్రోల్‌’ గాంధీలదేనన్న విమర్శలు వస్తున్నాయి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీని ఈ అంశంపై ప్రశ్నించగా.. ఖండించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు.  

‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులకూ సమాజంలో వారికంటూ ఓ స్థానం ఉంది. ప్రజలను అర్థం చేసుకోగలిగే దృక్పథం, ప్రజల పట్ల అవగాహన ఉంది. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి రిమోట్‌ కంట్రోల్‌ అనడం అంటే వారిని అవమానించడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు రాహుల్‌ గాంధీ. మరోవైపు.. యాత్రలో తానొక్కడినే పాల్గొనడం లేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగిన లక్షల జనం భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసం ఈ యాత్ర కాదని, భాజపా- ఆరెస్సెస్‌ తీసుకొస్తున్న విభజన నుంచి ప్రజలను ఐక్యం చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వికేంద్రీకరణ విద్యావిధానం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. ‘భారత్‌ అనేది రాష్ట్రాల సమూహం. దాని అర్థం మన భాషలు, రాష్ట్రాలు, సంప్రదాయాలకు సమానంగా ముఖ్యమైన స్థానం ఉంటుంది. అదే మన దేశ స్వభావం. హింస, విద్వేషాలను వ్యాప్తి చేయటం దేశ వ్యతిరేక చర్య. ఎవరైనా విద‍్వేషాలను రెచ్చగొట్టేవారికి వ్యతిరేకంగా మేము పోరాడతాం.’ అని తెలిపారు.

ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్

మరిన్ని వార్తలు