ట్రాక్టరే కాదు పొక్లెయినర్‌ నడపటం కూడా వచ్చు.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా: రేణుకా చౌదరి

30 Aug, 2022 07:34 IST|Sakshi

సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి): ‘సత్తుపల్లి సింగరేణి బాధితులకు ఇళ్లు కట్టిస్తే సరి.. లేకపోతే నాకు ట్రాక్టర్‌తో పాటు పొక్లెయినర్‌ నడపటం కూడా వచ్చు.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా..’ అని కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరి హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌ అధ్యక్షతన నియోజకవర్గ ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నేతల్లో ఎవరికైనా ఏమైనా అయితే రేణుక నుంచి రేవంత్‌రెడ్డి వరకు ఇక్కడకు వస్తామని భరోసా ఇచ్చారు. డబ్బు తీసుకుని ఓట్లు వేయటం వల్లే ఇలాంటి పాలకులు వస్తున్నారని, ఇక సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుహక్కును దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్‌ అభ్యర్థిగా మానవతారాయ్‌ను ఎన్నుకోవాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు.

ట్రాక్టర్‌ నడుపుతున్న రేణుకాచౌదరి, పక్కన మానవతారాయ్‌ తదితరులు

దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి
సింగరేణి నిధుల వినియోగంపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానని మానవతారాయ్‌ తెలిపారు. పదమూడేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పేదలకు గజం కూడా పంచలేదని మండిపడ్డారు. సభలో నున్నా రామకృష్ణ, మానుకొండ రాధాకిశోర్, ఎడవల్లి కృష్ణ, మద్ది శ్రీనివాసరెడ్డి, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కట్ల రంగారావు, బుక్కా కృష్ణవేణి పాల్గొన్నారు.
 
మట్టి అక్రమాలపై చర్యలు ఉండవా?
రఘునాథపాలెం: ఖమ్మం శివారు పువ్వాడనగర్‌ గుట్టలపై అనుమతికి మించి మట్టి తవ్వినట్లు అధికారులు గుర్తించినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. మండలంలోని కోయచెలక రెవెన్యూ పరిధి పువ్వాడనగర్‌ గుట్ట వద్ద క్వారీని సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈ విషయమై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నాయకులు మానుకొండ రాధాకిశోర్, దీపక్‌చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి, వాంకుడోత్‌ దీపక్‌నాయక్, దుంపటి నగేశ్‌ పాల్గొన్నారు.  

న్యాయం జరిగే వరకు పోరాటం
ఖమ్మంరూరల్‌: ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. మండలంలోని తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి మాట్లాడారు. పోలీసులు ఇకనైనా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, కళ్లెం వెంకటరెడ్డి, ధరావత్‌ రాంమూర్తినాయక్, మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు