హైఓల్టేజ్‌ పాలిటిక్స్‌.. కాంగ్రెస్‌లో కమిటీల కాక!  

13 Dec, 2022 01:37 IST|Sakshi

ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కని నేతల్లో అసంతృప్తి 

ఒకవైపు రాజీనామాలు.. మరోవైపు ‘అసమ్మతి’ భేటీ 

సీఎల్పీ నేత భట్టి నివాసంలో ముఖ్యనేతల సమావేశం 

మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డి తదితరుల హాజరు 

తమది అసమ్మతి భేటీ కాదు.. కాంగ్రెస్‌ ఆత్మల భేటీ అన్న నేతలు 

భట్టికి ఎంపీ కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు ఫోన్లు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరోమారు విభేదాలు రాజుకున్నాయి. గత రెండురోజుల క్రితం విడుదలైన టీపీసీసీ కమిటీల కూర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కని నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆదివారం ఇది రాజీనామాలకు దారితీయగా, సోమవారం అసమ్మతి నేతలంతా భేటీ అయ్యేవరకు వెళ్లింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసం ఇందుకు వేదిక కావడం గమనార్హం. అయితే తమ భేటీ అసంతృప్తుల భేటీ కాదని, కాంగ్రెస్‌ ఆత్మల భేటీ అని ఈ సమావేశానికి హాజరైన నాయకులు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్‌ పారీ్టలో చర్చనీయాంశమవుతోంది.  

కమిటీలపైనే చర్చ: హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో సోమవారం పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెనగోని దయాకర్, డాక్టర్‌ కురువ విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ఓయూ నాయకులు కూడా భట్టితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ కమిటీల కూర్పుపైనే ప్రధానంగా నేతల మధ్య చర్చ జరిగింది.

కమిటీల్లో ఉన్న పేర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఏకపక్షంగా కమిటీలను ఏర్పాటు చేశారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సంస్థాగత వ్యవహారాలు, టికెట్ల కేటాయింపు సమయంలో సీఎల్పీ నేతను కూడా పీసీసీ అధ్యక్షుడితో సమానంగా పరిగణిస్తారని, కానీ తాజా కమిటీల విషయంలో మాత్రం సీఎల్పీ నేతను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నేతలు అన్నారు. దశాబ్దాలుగా పారీ్టకి సేవలందిస్తున్న వారిని విస్మరించి, పారీ్టలోకి వచ్చి రెండేళ్లు కూడా కాని వారికి ప్రాధాన్యతతో కూడిన పదవులు ఎలా ఇచ్చారనే చర్చ కూడా వచ్చింది.

ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి లాంటి నేతలు ఉన్న జిల్లాల అధ్యక్షులను ప్రకటించకుండా నిలిపివేయడం, ఏఐసీసీ కార్యదర్శి హోదాలో ఉన్న శ్రీధర్‌బాబు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిని కనీసం ఆయన్ను సంప్రదించకుండా ప్రకటించడం సరైంది కాదని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీల విషయంలో ఢిల్లీ పెద్దలు వెంటనే చొరవ తీసుకోవాలని, జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని సమావేశంలో పాల్గొన్న నేతలు డిమాండ్‌ చేశారు.  

అభిప్రాయాలు చెబుతున్నారు: భట్టి 
భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. తాజా కమిటీల్లో చోటు దక్కిన వారు, దక్కని వారు కూడా తనను కలిసి వారి అభిప్రాయాలను చెబుతున్నారని వెల్లడించారు. పారీ్టలో చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ తమకు అవకాశం ఇవ్వలేదని కొందరు చెబుతున్నారన్నారు. మొదట్నుంచీ పారీ్టలో పనిచేస్తున్న వారికి తగిన అవకాశాలు రాలేదని, కమిటీల కూర్పులో సామాజిక సమతుల్యత లేదని కొందరు చెప్పారని తెలిపారు. వారి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

నాతో మాట్లాడలేదు.. 
ఎలాంటి కసరత్తు జరగకుండానే కమిటీలను ప్రకటించారని, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడితో పాటు పారీ్టలోని సీనియర్‌ నేతలందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటే బాగుండేదని భట్టి అన్నారు. ఈ కమిటీల విషయంలో తనతో అధిష్టానం మాట్లాడలేదని చెప్పారు. పారీ్టకి పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడు కూడా ముఖ్యమేనని, కానీ ఈసారి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని భట్టి వ్యాఖ్యానించారు.  

భట్టికి ఎంపీ కోమటిరెడ్డి ఫోన్‌ 
కమిటీల్లో కనీస ప్రాతినిధ్యం లభించని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలో సభ్యుడినైన తనను కమిటీల్లో ఎందుకు చేర్చలేదో అధిష్టానం నుంచి వివరణ తీసుకోవాలని కోరినట్టు సమాచారం. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా భట్టితో ఫోన్‌లో మాట్లాడారని, టీపీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ఇరువురు నేతలు చాలాసేపు ముచ్చటించారని సమాచారం.    

మరిన్ని వార్తలు