దారుణ ఓటమి... కారణమేంటి? 

4 Nov, 2021 00:42 IST|Sakshi
గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ భేటీలో చర్చిస్తున్న కాంగ్రెస్‌ నేతలు 

కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో వాడీవేడి చర్చ 

పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్‌ నేతలు 

పార్టీ అంతర్గత అంశాలపై బహిరంగ విమర్శలు వద్దని పీసీసీ నేతలకు మాణిక్యం ఠాగూర్‌ ఆదేశం 

ఏదిపడితే అది మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక 

మీడియాతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ప్యానెల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దారుణ ఓటమి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీని కుదిపేస్తోంది. ఉప ఎన్నిక ఫలితాల సరళి వెలువడిన వెంటనే కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం.. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీలోనూ సెగలు పుట్టించింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడం ఏమిటి, అసలు తప్పు ఎక్కడ జరిగిందనే అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో సరిగా వ్యవహరించలేదని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు ఓటమి కారణాలను లోతుగా పరిశీలించేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. ఇక ఉప ఎన్నిక ఫలితం ఇలా ఉంటుందని ముందే ఊహించామంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీకి సంబంధించి అంశాలపై కొందరు నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. అంతర్గత ప్రజాస్వామ్యంపేరుతో ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టుగా పార్టీ లైన్‌ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం.

బుధవారం గాంధీభవన్‌లో మాణిక్యం ఠాగూర్‌ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు, పార్టీ సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర, విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్, భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. 

హుజూరాబాద్‌లో ఎందుకిలా? 
కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో ఉప ఎన్నిక పరాజయం అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగింది, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఎటు పోయింది?, ఎందుకు ఇంత దారుణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్న ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఎంపిక అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి టికెట్‌ ఇచ్చినా టీఆర్‌ఎస్‌ నేతలు కొనుగోలు చేస్తారనే ఆలోచనతోనే.. పార్టీకి కట్టుబడి ఉండే బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపామని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.

అయితే దీనిపై వీహెచ్‌ మాట్లాడుతూ.. కొండా సురేఖ వంటి బలమైన నాయకురాలు ఉన్నా ఎందుకు బరిలోకి దించలేదని ప్రశ్నించినట్టు సమాచారం. స్థానిక కుల సమీకరణాల ఆధారంగా అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని, లేదంటే ఎస్సీ వర్గాలకు వ్యక్తిని నిలబెట్టాల్సి ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థి ఖరారు అంశాన్ని భట్టి విక్రమార్క, దామోదర రాజ నర్సింహలతో కూడిన కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకే అభ్యర్థిని ఖరారు చేశామని వివరించినట్టు తెలిసింది.

అయితే.. హుజూరాబాద్‌ ఓటమికి రేవంత్‌రెడ్డి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని, తానే బాధ్యత వస్తానని రేవంత్‌ చెప్పడం కూడా కరెక్ట్‌ కాదని సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ఈ ఓటమికి పార్టీ నేతలందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో పార్టీ సరైన వ్యూహంతో వెళ్లలేకపోయిందని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోటీలో సరిగా వ్యవహరించలేకపోయామని మరికొందరు నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. హుజూరాబాద్‌ ఓటమి గల కారణాలను తేల్చేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ ఎదురుకాకుండా సూచనలు చేసేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఈ కమిటీని ప్రకటించాలని.. ఆ కమిటీ అన్ని అంశాల్లో విచారణ జరిపి పీఏసీకి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. 

సామాజిక వర్గ ముద్రను తొలగించుకోవాలి 
ఈటల విజయాన్ని తేలికగా తీసుకోవద్దని.. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అంటే ఫలానా సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలని.. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, బీసీల నుంచి మంచి నేతలను తయారుచేసి ముందు నిలబెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇక గతంలో తాను హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినప్పుడు ముందే ఎలా చెప్తారని తప్పుబట్టిన నేతలు.. ఇప్పుడు పెద్దపల్లి, భూపాలపల్లిలో అభ్యర్థులను ముందుగానే ఎలా ప్రకటిస్తారని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేసినట్టు తెలిసింది.

పీఏసీ సమావేశాలకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ హాజరు కాకపోవడంపైనా చర్చ జరిగింది. ఇటు సమావేశాలకు రాకుండా, అటు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఓ కీలక నేత ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై మరో నేత స్పందిస్తూ..  ఉత్తమ్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా చాలా మంది అలా ఇష్టానుసారం మాట్లాడారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. చివరిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జనజాగరణ యాత్రను విజయవంతం చేయడంపై చర్చించారు. టీపీసీసీ నాలెడ్జ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

బహిరంగ విమర్శలు వద్దు 
హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓటమితో నేతల మధ్య ఒక్కసారిగా విమర్శలు, ప్రతి విమర్శలతో క్రమశిక్షణ పట్టుతప్పుతున్న విషయాన్ని మా ణిక్యం ఠాగూర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా పీఏసీ భేటీల్లోనే చర్చించాలని, లేదంటే నేరుగా సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా మా ట్లాడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయాలే కాకుండా ఇతర పరిణామాలపై టీవీ చానళ్లలో జరిగే డిబేట్లకు కూడా ఎవరంటే వారు వెళ్లవద్దని, ఇందుకోసం ప్యానెల్‌ తయారుచేయాలని, ఆ ప్యానెల్‌లో ఉన్న వారే ఆయా కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొ న్నారు.

ఈ సమావేశంలో పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతోపాటు కమిటీ సభ్యులు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రేణుకాచౌదరి, బలరాంనాయక్, దాసోజు శ్రవణ్‌  పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాత్రం రాలేదు.  

మరిన్ని వార్తలు