టీషర్ట్‌ రాజకీయం స్థాయికి బీజేపీ దిగజారింది

13 Sep, 2022 01:50 IST|Sakshi

మోదీ రూ.60 లక్షల సూట్లెక్కడ? రాహుల్‌ రూ.40 వేల టీషర్ట్‌ ఎక్కడ? 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ధరించిన టీషర్ట్‌ గురించి రాజకీయం చేసే స్థాయికి బీజేపీ దిగజారిందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీపై ఏ విమర్శలు చేయాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల గురించి రాహుల్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే బీజేపీ టీషర్ట్‌ రాజకీయం చేస్తోందన్నారు. మరి పూటకో డ్రస్‌ మార్చే ప్రధాని మోదీ గురించి ఏం చెబుతారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ రూ.40వేల టీషర్ట్‌ ధరించారని, మోదీ రోజూ వేసుకుని తిరిగే రూ.60లక్షల విలువైన డ్రెస్‌ల గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.  

రాహుల్‌ యాత్ర రూట్‌ మార్పుపై చర్చిస్తా.. 
రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తన నియోజకవర్గంలో కూడా 30 కిలోమీటర్ల మేర ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ప్రవేశించి నియోజకవర్గం దాటి వెళ్లేంతవరకు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని రాహుల్‌ యాత్రను విజయవంతం చేస్తామని పక్రటించారు. అయితే, ఓఆర్‌ఆర్‌ మీదుగా జరిగే పాదయాత్రతో ప్రయోజనం ఉండదని, అందుకే దీనిపై పీసీసీ నాయకత్వంతో చర్చిస్తానని, శంషాబాద్‌ నుంచి రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లిల మీదుగా సంగారెడ్డికి వచ్చేలా రూట్‌ మార్చాలని పీసీసీని కోరతానని జగ్గారెడ్డి వెల్లడించారు.     

మరిన్ని వార్తలు