పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు: జగ్గారెడ్డి

1 Dec, 2022 08:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్‌ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్‌స్టాండింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్‌ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్‌ చేయాలని చూస్తున్నారని చెప్పారు. 

పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు 
పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్‌ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.
చదవండి: కేసీఆర్‌.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం..

మరిన్ని వార్తలు