దో షేర్‌.. దో బకరే 

8 Sep, 2021 08:03 IST|Sakshi

కేసీఆర్, అమిత్‌షా ఆటలో సంజయ్, రాజేందర్‌ బలి కావడం ఖాయం

మీడియాతో ఇష్టాగోష్టిలో జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయ క్రీడలో రెండు సింహాలు, రెండు మేకలున్నాయని.. ఇందులో కేసీఆర్, అమిత్‌షాలు సింహా లైతే, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు మేకలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, అమిత్‌ షా ఆడుతున్న ఆటలో వారిద్దరూ బలికావడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కమిటీకి ఎలాంటి అధికారం లేదని, పవర్‌ అంతా ఢిల్లీలోనే ఉందని ఎద్దేవా చేశారు.

గల్లీలో బండి సంజయ్‌ కేసీఆర్‌ను తిడతారని, ఢిల్లీలో మోదీ, అమిత్‌షాలు అదే కేసీఆర్‌తో మంతనాలు జరుపుతారని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసమే కేసీఆర్‌ బీజేపీతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్, బీజేపీ అధిష్టానం ఆడే క్రీడలో రాష్ట్ర బీజేపీ నేతలు డమ్మీలవుతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వర్షాల వల్ల నష్టపోయిన వారందరికీ రూ.10వేల చొప్పున సాయం చేయాలని కోరారు.  

ప్రజలు వరదలతో అల్లాడుతుంటే రాజకీయాలా? 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌లు రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌.జీ. వినోద్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..గతేడాది హైదరాబాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.   

మరిన్ని వార్తలు