టీఆర్‌ఎస్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి..

5 Dec, 2020 15:43 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు చూసైనా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హితవు పలికారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావాల్సిందని, అకాల వర్షాలతో 50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చేలా లేదని పేర్కొన్నారు. ‘‘వరి ధాన్యానికి మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రకటించిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలిపి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. వివిధ కారణాలతో కాటన్ కార్పొరేషన్‌ కూడా పత్తి మద్దతు ధరలో కోత పెడుతుంది. (చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!)

వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ధాన్య సేకరణలో అధికారులు ఫెయిల్‌ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల సహాయం చేస్తోంది. తెలంగాణలో అలాంటి ఆలోచనే చేయకపోవడం దుర్మార్గం. రబీ సాగు ప్రారంభమయినా.. రెండో విడత రైతు బంధు ఊసే లేదు. అదే ఎన్నికలైతే.. రైతుబంధు వెంటనే బ్యాంక్‌ ఖాతాలో పడతాయని’’ ఆయన దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాలు అన్ని డిస్ ప్లే కావాలని, కానీ కొన్ని అంశాలే కనిపిస్తున్నాయన్నారు. ధరణి పోర్టల్ లో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ల నుంచి ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకొని పరిష్కరించాలని సుచించారు. వారసత్వ  భూమి రిజిస్ట్రేషన్‌కు చాలా అడ్డంకులు ఉన్నాయని, హిందూ వారసత్వ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ఔరంగజేబు చుట్టు పన్నులాగ కేసీఆర్ మ్యూటేషన్ చార్జ్ వేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి: కాంగ్రెస్‌ ఓటమి.. రేవంత్‌ వర్గంలో ఆశలు)

‘‘నిర్మాణ రంగం నిలిచిపోయింది. ధరణి పోర్టల్ యాక్షన్ మీద మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిందో అర్థం కావట్లేదు. ఎమ్మార్వోకు రిజిస్ట్రేషన్లు తప్ప మరోపని చేయడానికి వీలులేకుండా పోయింది. ఇకనైనా  సీఎం కేసీఆర్‌కు బుద్ధి రాకపోతే.. భవిష్యత్తులో మరింత నష్టపోతారని’’ జీవన్‌రెడ్డి హితవు పలికారు.

మరిన్ని వార్తలు