మునుగోడుపై మరింత ఫోకస్‌.. రేవంత్‌తోపాటు కీలక నేతలందరూ అక్కడే

9 Oct, 2022 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నిక ముహూర్తం దగ్గర పడుతున్న కీలక దశలో మునుగోడు నియోజకవర్గంపై మరింత ఫోకస్‌ పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బూత్‌స్థాయి నుంచి శక్తివంచన లేకుండా పనిచేసి పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం కృషి చేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానించారు. మునుగోడు ఉపఎన్నిక వ్యూహంపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్య నేతలు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావెద్, రోహిత్‌ చౌదరి, సంపత్‌కుమార్‌లతోపాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా ఆదివారం నుంచి టీపీసీసీ ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మకాం వేయాలని నిర్ణయించారు. గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేవంత్‌తో సహా కీలక నాయకులందరూ ఈనెల 14వరకు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. మండలానికి ముగ్గురు చొప్పున నియమించిన ఇంచార్జులతో కలిసి కీలక నాయకులు ఆరు రోజులపాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.

అలాగే, పార్టీ కేడర్‌ను కూడా ఎన్నికలకు సన్నద్ధం చేసే బాధ్యతలను తీసుకోనున్నారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను కదిలించాలని, పార్టీ నేతలంతా సమష్టి కృషి చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఉప ఎన్నిక వచ్చిన కారణాన్ని వివరించడం, బీజేపీ–టీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని ఓటర్లకు చెప్పడం లాంటి వ్యూహాలను అమలు చేయాలని కూడా నిర్ణయించారు.
చదవండి: మునుగోడు కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’

మరిన్ని వార్తలు