చీతాల వల్లే దేశంలోకి లంపీ డిసీజ్ వచ్చిందన్న కాంగ్రెస్ నేత.. ఆటాడుకున్న బీజేపీ

4 Oct, 2022 11:56 IST|Sakshi

ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్‌కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అ‍న్నారు. 

'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్‌గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు.

బీజేపీ గట్టి కౌంటర్..
అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్‌కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు.

కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ ‍పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది.
చదవండి: కాంగ్రెస్‌ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు