కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం 

5 Feb, 2023 03:15 IST|Sakshi
సీనియర్‌ నేతలతో సమావేశం అయిన మాణిక్‌ రావ్‌ ఠాక్రే.  చిత్రంలో రేవంత్, ఉత్తమ్‌ కుమార్‌ 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే 

రాహుల్‌ సందేశాన్ని గడపగడపకూ తీసుకెళ్లడమే హాథ్‌ సే హాథ్‌జోడో లక్ష్యం 

రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్‌ సంక్షోభాలు: రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రతి ఇంటికీ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే వెల్లడించారు. భారత్‌జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీన మేడారంలో జోడో యాత్రలను ప్రారంభిస్తామని, రెండు నెలలపాటు ఈ పాదయాత్రలు కొనసాగుతాయని చెప్పారు.

శనివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశమైన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలు ఒకేసారి ప్రారంభమవుతాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ తదితర ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహిస్తామని చె ప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మాట్లాడుతూ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతసహా ఇతర ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, విద్యుత్‌రంగాల్లో సంక్షోభం ఏర్పడిందని, ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని రేవంత్‌ చెప్పారు. రైతుల రుణమాఫీ కాలేదని, 2014–17 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉందన్నారు. 

కాంగ్రెస్‌ నుంచి దృష్టి మరల్చేందుకే 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒకే తానులోని ముక్కలని అభివర్ణించారు. ఎనిమిదేళ్లపాటు అన్ని అంశాల్లో కలిసి పనిచేసిన ఆ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్‌ వైపు చూస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇరుపార్టీలు నాటకాలకు తెరలేపాయని విమర్శించారు.  పచ్చిఅబద్ధాలు ఆడిన గవర్నర్‌ కేసీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని కోరారు. రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయనకు క్యాట్‌ వాక్, డిస్కో డ్యాన్స్, పబ్‌ల గురించి మాత్రమే తెలుసని విమర్శించారు.   

>
మరిన్ని వార్తలు