-

2024 General Election: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం

26 Feb, 2023 03:57 IST|Sakshi

నవ రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌): ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భావసారూప్య పార్టీలతో చేయిచేయి కలిపేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. లక్ష్య సాధన కోసం త్యాగాలు చేసేందుకు వెనుకాడబోమని ఉద్ఘాటించారు. రాయ్‌పూర్‌లో పార్టీ ప్లీనరీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఢిల్లీ ప్రధానసేవకుడైన ఆయన ముఖచిత్రంతో రోజూ పత్రికల్లో అడ్వర్‌టైజ్‌మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆయన మాత్రం తన సొంత స్నేహితుడి కోసం సేవలందిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

‘పేదల వ్యతిరేక వైఖరి బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది. ప్రజాస్వామ్యం ఖూనీకాకుండా ఆపేందుకు ప్రజాఉద్యమం వెల్లువలా రావాల్సిన అవసరమొచ్చింది. భారత్‌ జోడో యాత్ర..  ప్రజాసమస్యలకు గొంతుకగా మారింది. బీజేపీ హయాంలో రాజ్యాంగ విలువలు, సామాజిక సామరస్యం దెబ్బతిన్నాయి. చైనాతో సరిహద్దు వివాదం, పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు దేశానికి పెను సవాళ్లు విసురుతున్నాయి.

ఈ తరుణంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భావసారూప్య పార్టీలే కొత్త ప్రభుత్వపాలన ద్వారా ప్రజాసంక్షేమాన్ని సాధ్యంచేయగలవు. అందుకోసం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సదా సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటరీ, రాజ్యాంగ సంప్రదాయాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఈడీ, సీబీఐలను బీజేపీ రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ సమావే శాలకు ఇబ్బందికలిగేలా ఇక్కడి నేతలపై ఈడీ దాడులకు తెగబడింది. అయినా నేతలు తెగవతో ఎదుర్కొని సమావేశాలు సజావుగా సాగేలా చేశారు’ అని అన్నారు.

రైతుకు రూ.27.. వారికి రూ.1,000 కోట్లు
కుబేరుడు గౌతమ్‌ అదానీని ఉద్దేశిస్తూ.. ‘ దేశం ఎటు పోతోంది? ఓవైపు రైతుకు రోజుకు కేవలం రూ.27 ఆదాయం దక్కుతుంటే ప్రధాని స్నేహితుడు రోజుకు రూ.1,000 కోట్ల ఆదాయం ఎలా రాబట్టగలుగుతున్నారు? కోవిడ్‌ కాలంలో ప్రధాని స్నేహితుల సంపద 1,300 శాతం ఎగసింది. రైల్, భెయిల్‌ (భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌), సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా).. ఇలా ప్రతీదీ వారికే ధారాదత్తం చేస్తున్నారు.

ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అయినా ఉంచుతారో లేక వీరికే అమ్మేస్తారోనని ప్రజల్లో ఆలోచనలు పెరిగాయి. ధరాఘాతంతో దేశ ప్రజల ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతుంటే ఇక్కడి పారిశ్రామికవేత్తలు అపరకుబేరుల అవతారం ఎత్తుతున్నారు. అధికార బుల్డోజర్‌ కింద పేదలు నలిగిపోతున్నారు.  ఓవైపు చైనా భారత భూభాగంలోకి చొరబడుతుంటే విదేశాంగ మంత్రి జైశంకర్‌ తన తండ్రికి అప్పట్లో ప్రమోషన్‌ దక్కలేదని వాపోతారు’ అని ఖర్గే అన్నారు. 

ఇవే మా లక్ష్యాలు
‘ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నిత్యావసర సరకుల ధరలు దించుతాం. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గిస్తాం. రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పిస్తాం. విద్వేష వాతావరణాన్ని చెదరగొట్టి సామరస్యాన్ని సాధించి చూపుతాం. ధన బలం, అధికార బలం లేకుండా చూస్తాం. దేశ పురోభివృద్ధిలో ప్రజలతో కలిసి నడుస్తాం. ముందుండి నడిపిస్తాం’ అన్నారు.

సీడబ్ల్యూసీలో 50 శాతం వారికే
వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ శనివారం కాంగ్రెస్‌ పార్టీ తన పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసింది. సవరణ ప్రకారం పార్టీ నుంచి ప్రధానులైన నేతలు, మాజీ ఏఐసీసీ చీఫ్‌లకు సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఉంటుంది. సీడబ్ల్యూసీ సభ్యుల సంఖ్యను 25 నుంచి 35కు పెంచారు. ఇకపై పార్టీలో కేవలం డిజిటల్‌ మెంబర్‌షిప్, రికార్డులను కొనసాగిస్తారు.

మూడో ఫ్రంట్‌తో ఎన్‌డీయేకే మేలు
మూడో ఫ్రంట్‌ అనే మాటే వినపడకుంటే భావసారుప్యత ఉన్న అన్ని పార్టీలను ‘గుర్తించి’, ‘సమీకరించి’, ‘ఏకంచేసే’ బృహత్తర పనికి వెంటనే పూనుకోవాలనే రాజకీయ తీర్మానం ముసాయిదాలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ‘కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తుకు లౌకిక, సామ్యవాద శక్తుల ఏకీకరణే అసలైన హాల్‌మార్క్‌గా నిలుస్తుంది. ఎన్‌డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయాల్సిన అత్యవసరస్థితి ఇది. ఆలస్యం చేస్తే అది ఎన్‌డీయేకే మేలు చేస్తుంది’ అని ముసాయిదాలో నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు