కాంగ్రెస్‌ ‘దళిత, గిరిజన దండోరా’ 

25 Jul, 2021 01:32 IST|Sakshi

ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం 

ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ 

టీపీసీసీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా మోగించడానికి సన్నద్ధమవుతోంది. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలను వంచనకు గురిచేసిన వైనాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. క్విట్‌ ఇండియా ఉద్యమరోజైన ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17 వరకు పల్లెపల్లెనా ‘దళిత, గిరిజన దండోరా’కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఇక్కడ ఇందిరాభవన్‌లో టీపీసీసీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు టి.జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌లు హాజరుకాగా, మరో ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, కోకాపేట, పోడు భూముల అంశాలు, వరదలు, దళితబంధు పథకంపై నేతలు రెండుగంటలకుపైగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిలు మీడియాకు వెల్లడించారు. అసైన్డ్‌ భూములను బలవంతంగా కొందరు లబ్ధిదారుల నుంచి లాక్కుంటున్నారని, వీరిపై ఫిర్యాదు చేద్దామంటే కలెక్టర్లు కూడా సీఎం కేసీఆర్‌ లాగానే తమ ఫామ్‌హౌస్‌లకు పరిమితమయ్యారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ఏ పార్టీలో చేరతారో చెప్పలేదని, అయితే, దళితులకు జరుగుతున్న అన్యాయాలను గురించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.  

టీపీసీసీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలు, డిమాండ్లివే 
► దళితబంధు పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ‘దళిత, గిరిజన దండోరాలో భాగంగా ఊరూరా ఎండగట్టాలి. ఆ తర్వాత బీసీ దండోరా పేరుతో మరో కార్యక్రమం చేపట్టాలి. ఏడేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 
► రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా మరిం త బలోపేతమయ్యేందుకుగాను భావసారూప్యత ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలి. కోదండరాం, చెరుకు సుధాకర్, గద్దర్, విమలక్క లాంటి వారిని తమతో కలసి రావాలని ఆహ్వానించాలి.  
► ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పై నిర్వహిస్తున్న ఆందోళనలను కట్టడి చేసే పేరుతో రాష్ట్ర పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయాలి. మానవ హక్కుల కమిషన్‌తోపాటు పలు కోర్టుల్లో కేసులు వేయాలి.  
► కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతోపాటు సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలి. గిరిజనుల పోడు భూముల పరిరక్షణ కోసం గిరిజన ప్రజాప్రతినిధులతో కలసి కార్యాచరణ రూపొందించాలి.  

మరిన్ని వార్తలు