కాంగ్రెస్‌కు కలిసొచ్చింది

27 Dec, 2023 04:51 IST|Sakshi

ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలనతో ఏడాది చివర్లో బిజీబిజీ 

2023లో ఎన్నికల లక్ష్యాన్ని ఛేదించిన హస్తం పార్టీ

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఇదే సంవత్సరంలో  ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. 2023 మొదట్లో దారీతెన్నూ లేని దిశలో సాగిన టీపీసీసీ  ప్రయాణం ఏడాది ముగిసేసరికి విజయతీరాలను చేరింది. సంక్షోభం నుంచి సక్సెస్‌ వరకు,  పోటీ ఇస్తామా అనే స్థాయి నుంచి పవర్‌ దక్కించుకునేంత వరకు ఈ సంవత్సరం కాంగ్రెస్‌  పార్టీకి బలాన్నిచ్చింది. ఏడాది చివర్లో ప్రభుత్వ ఏర్పాటు కలను కూడా నెరవేర్చుకుంది.  – సాక్షి, హైదరాబాద్‌

డిగ్గీరాజా వచ్చి... ఠాగూర్‌ను తప్పించి 
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కాంగ్రెస్‌ పార్టీలో కలహాలతోనే ప్రారంభమైంది. ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మాటల యుద్ధానికి దిగారు. ఒకదశలో ఇది తీవ్ర రూపం దాల్చడంతో అధిష్టానం జోక్యం చేసుకుంది. సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ అలియాస్‌ డిగ్గీరాజాను రంగంలోకి దించింది.

ఆయన స్థానిక నాయకత్వంతో చర్చించి అధిష్టానానికి కీలక నివేదిక అందజేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ మాణిక్యంఠాగూర్‌ అనూహ్యంగా తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్‌ ఠాక్రేను అధిష్టానం తెలంగాణకు పంపింది.

ఠాక్రే రాక తర్వాత క్రమంగా కాంగ్రెస్‌ అంతర్గత పరిస్థితులు ఒకొక్కటిగా చక్కబడ్డాయి. రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో చాలా మేరకు ఆయన విజయవంతమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఐక్యరాగాన్ని అందుకున్నారు. పైకి కనిపించిన ఆ ఐక్యరాగమే తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ రకంగా విజయతీరాలకు చేర్చిందని చెప్పవచ్చు.  

5 నుంచి 65కు పెరిగిన బలం 
ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్‌ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. 2018 ఎన్నికల్లో గెలిచిన వారిలో మెజారిటీ సభ్యులు పార్టీని వీడడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ ఏడాది తిరిగే సరికి 65 మంది సభ్యుల (మిత్రపక్షమైన సీపీఐతో కలిపి)కు తన బలాన్ని పెంచుకుంది.

ఇక, ఏడాది చివర్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలన లాంటి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భట్టి విక్రమార్క లాంటి నాయకుల ఆధ్వర్యంలో వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళుతోంది.   

మూడోస్థానం నుంచి మొదటి స్థానానికి 
ఏడాది ఆరంభంలో మూడోస్థానంలో (బీఆర్‌ఎస్, బీజేపీల తర్వాత) ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే కొద్దీ రెండో స్థానంలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి చేరుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కి పెద్ద బూస్టప్‌ ఇచ్చాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మార్పుతో ఇక కాంగ్రెస్‌ పార్టీ కి వెనుదిరిగి చూడా­ల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటికే డిక్లరేషన్‌ల పేరుతో ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్, ఆ తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో దూకుడుతో బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టగలిగింది.

బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే భావనను ప్రజలకు కలిగించడంలో సఫలీకృతమైంది. జూలై మొదట్లో ఖమ్మంలో నిర్వహించిన ప్రజాగర్జనసభ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ వేవ్‌ మొదలైంది. సభకు రాహుల్‌గాంధీ హాజరు కావడం, రాష్ట్రమంతా ప్రభావం చూపే విధంగా మాజీ ఎంపీ పొంగులేటి బృందం కాంగ్రెస్‌లో చేరడం, సీఎల్పీ నేత హోదాలో భట్టి విక్రమార్క చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ముగింపు అక్కడే జరగడంతో పార్టీ కి కొత్త ఊపు వచ్చింది. అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ కి డిక్లరేషన్‌లు, ఆరుగ్యారంటీలకు తోడు తెలంగాణలో అధికారం రావడం తన కల అని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి.

ఇతర పార్టీ ల నుంచి కూడా ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పార్టీ నుంచి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి తదితరులు రావడం, మైనంపల్లి హన్మంతరావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి లాంటి నేతలు పార్టీ లోకి రావడం పెద్ద బలాన్నే ఇచ్చింది. వెరసి... మూడో స్థానం నుంచి మొదటి స్థానం వరకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ  ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకోగలిగింది.  

>
మరిన్ని వార్తలు