Munugode Politics: మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌.. మరి కాంగ్రెస్‌?

29 Aug, 2022 08:52 IST|Sakshi

మునుగోడుపై కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ

దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌

హస్తం పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు

అభ్యర్థి తేలక క్షేత్రస్థాయిలో కొరవడిన ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా, తాము వెనుకబడ్డామనే భావన కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగతా రెండు పార్టీలు నియోజకవర్గం, మండల స్థాయిల నుంచి గ్రామ స్థాయి వరకు వెళుతుండగా, కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారనే చర్చ నియోజకవర్గ స్థాయిలో కూడా జరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలు తమ బలాలను ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునే పనిలో నిమగ్నమై ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు నియోజకవర్గంలోని గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పాటు టికెట్‌ ఎక్కువ మంది ఆశిస్తుండడం, ఇప్పుడే ఎందుకులే అనే భావన, రాష్ట్ర స్థాయి నుంచి సరైన పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడం కారణమనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

వేధిస్తున్న వలసలు
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమే పోరు సాగనుంది. ఇది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో పాటు ఆ పార్టీకి కేడర్‌ కూడా బాగానే ఉంది. కానీ ఇతర పార్టీలు దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో ఉన్న కేడర్‌ నిస్తేజంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా టీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు గాలం వేసి తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్‌ వార్డు సభ్యుల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ పరిధిలోని నాయకులు టీఆర్‌ఎస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదనే భావన స్థానిక కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుండడంతో ప్రతిరోజూ వలసల పర్వం కొనసాగుతోంది.
    
దూసుకుపోతున్న కారు
టీఆర్‌ఎస్‌ పక్షాన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పార్టీ సింబల్, కేసీఆర్‌ బొమ్మలున్న గోడ గడియారాలు, గొడుగులు నియోజకవర్గానికి చేరిపోయాయి. వీలున్నంత మేరకు ఇతర పార్టీల నేతలను చేర్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి నిధుల ఖర్చుపై దృష్టి పెట్టింది. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు రానున్న నేపథ్యంలో గ్రామపంచాయతీల చేత తీర్మానాలు చేయించి ప్రతిపాదనలు కూడా పంపించారు. 2, 3 రోజుల్లో నిధులు వస్తాయని, పనులు కూడా ప్రారంభం అవుతాయనే చర్చ జరుగుతోంది. 

చదవండి: (మరింత క​ష్టపడాలి.. బీజేపీ నేతలతో జేపీ నడ్డా)

రోజుకో గ్రామానికి రాజగోపాల్‌
బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. పాత కాంగ్రెస్‌ కేడర్‌తో పాటు తనకున్న వ్యక్తిగత చరిష్మాను ఉపయోగించుకుంటూ.. పార్టీలో చేర్చుకున్న నేతలతో కలిసి రోజుకో గ్రామానికి వెళుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇప్పటికే నియోజకవర్గంలో బహిరంగసభలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రామాలు, మండలాల్లో ఉత్తేజంగా తిరుగుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుదనం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్షేత్రస్థాయికి చేరని కాంగ్రెస్‌
ప్రస్తుత పరిస్థితిలో వీలైనంత త్వరగా మార్పు వస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేసిన కాంగ్రెస్‌ నేతలు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది తేలితే కానీ ప్రచారం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిల్లో ఎవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటినుంచే గ్రామాలకు వెళ్లి అంతా రెడీ చేసుకున్న తర్వాత టికెట్‌ రాకపోతే ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్న ఆశావహులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా అభ్యర్థి ఖరారు చేసే యోచనలో టీపీసీసీ నాయకత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కసరత్తు పూర్తి కాగా, ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరింది. వినాయకచవితి తర్వాత  ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

చదవండి: (‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’)

మరిన్ని వార్తలు