రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈడీ దాడులు

16 Jun, 2022 01:28 IST|Sakshi
దీక్షలో మాట్లాడుతున్న జగ్గారెడ్డి. చిత్రంలో రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్‌

మూడోరోజు ‘ఈడీ దీక్ష’లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకనే బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఈడీని ఉసిగొలుపుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి బీజేపీ వైఫల్యాలను నిలదీసేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ ఆయన పాదయాత్రను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ వరుసగా మూడోరోజు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్‌ శ్రేణులు, నేతలు గాంధీభవన్‌కు చేరుకుని దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీని ప్రజల నుంచి దూరం చేయాలన్నదే బీజేపీ ఉద్దేశమని చెప్పారు.

ఏఐసీసీ కార్యాలయంలోకి చొరబడి పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, అంజన్‌కుమార్‌ యాదవ్, రాములు నాయక్‌ మల్లు రవి, శివసేనారెడ్డి, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్‌గౌడ్, మెట్టు సాయికుమార్, వరలక్ష్మి, నీలం పద్మతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు