బీజేపీని తుడిచేస్తాం

5 Jun, 2023 03:45 IST|Sakshi
న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో రేవంత్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనిపించదు 

అన్ని ఎన్నికల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం.. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌

న్యూయార్క్‌: కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనూ పునరావృతం అవుతాయని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీయే కాకుండా యావత్‌ భారత్‌ ప్రజలు విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించడానికి సిద్ధమయ్యారని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ న్యూయార్క్‌లో శనివారం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌–యూఎస్‌ఏ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.

‘‘కర్ణాటకలో మేము బీజేపీని ఓడించలేదు. తుడిచిపెట్టేశాము. ఆ పార్టీని నిర్మూలించాం. బీజేపీ గెలుపు కోసం చేయని ప్రయత్నం లేదు.మీడియా అంతా వారి వైపే ఉంది. మా దగ్గర కంటే 10 రెట్లు ధనబలం వారికి ఉంది. వారి చేతిలో అధికారం ఉంది. అన్నీ బీజేపీకే ఉన్నా వారిని తుడిచిపెట్టేశాం.’’ అని రాహుల్‌ చెప్పారు. కర్ణాటక తర్వాత తెలంగాణలో బీజేపీని మట్టికరిపిస్తామన్నారు.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ఇక అక్కడ కనిపించదని జోస్యం చెప్పారు.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో కూడా కర్ణాటక ఫలితాలే వస్తాయన్నారు. సమాజంలో బీజేపీ వ్యాప్తి చేస్తున్న విద్వేష వాతావరణం మధ్య ముందుకు వెళ్లలేమని భారత్‌ ప్రజలకు బాగా అర్థమైందని చెప్పారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామని రాహుల్‌ ధీమాగా చెప్పారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు సిద్ధాంతాల మధ్య పోరాటంగా రాహుల్‌ అభివర్ణించారు. విద్వేషానికి, ప్రేమకి మధ్య జరిగే పోరాటంలో బీజేపీ ఓడిపోవడం తథ్యమన్నారు.  

రాజకీయాల కంటే ఇంకా పెద్ద విషయాలుంటాయ్‌ : జై శంకర్‌ 
అమెరికా పర్యటనలో రాహుల్‌ గాంధీ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ విరుచుకుపడ్డారు. విదేశాల్లో రాజకీయాల కంటే మాట్లాడాల్సిన పెద్ద అంశాలెన్నో ఉంటాయని అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన కేప్‌టౌన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విదేశీ గడ్డపై అడుగు పెట్టినప్పుడు రాజకీయాల కంటే పెద్ద అంశాలపై మాట్లాడాలని, ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.    

మరిన్ని వార్తలు