కమీషన్ల కోసమే ప్రాజెక్టులు 

31 Oct, 2022 01:31 IST|Sakshi
ఆదివారం రాజాపూర్‌లో పిల్లలతో కలిసి సరదాగా పరుగులు తీస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. చిత్రంలో రేవంత్‌రెడ్డి తదితరులు

కేసీఆర్‌ ప్రభుత్వం విద్య, వైద్యం నిధులను ప్రాజెక్టులకు మళ్లించింది 

‘ఫీజు’ను నిలిపేసి పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది 

లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించి ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు 

షాద్‌నగర్‌లో రాహుల్‌ ఆరోపణలు 

అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఉచిత విద్య అందిస్తామని హామీ 

పెట్రో బాదుడుపై నోరుమెదపరేమని ప్రధాని మోదీకి సూటిప్రశ్న 

టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజల గొంతు నొక్కుతున్నాయని ధ్వజం 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెట్టాల్సిన ఖర్చును కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులకు మళ్లించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిలిపేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ నిధులతో కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. షాద్‌నగర్‌ నియోజకవర్గ శివారులో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ... లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పి యువతను మోసగించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలోనూ నిరుద్యోగం తాండవిస్తోందని, చదువుకున్న వాళ్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

దళిత, ఆదివాసీలకు భూములు తిరిగిస్తాం.. 
‘తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిరోజూ ధరణి పోర్టల్‌ చూస్తుంటాడు. ఈరోజు ఎన్ని ఎకరాల ఆదివాసీ, దళిత, గిరిజన భూములను లాక్కున్నామనే విషయంలో ప్రతి రాత్రికి ఆయనకు ఓ రిపోర్టు వస్తుంది. ధరణి పోర్టల్‌ ద్వారా పేదల భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకుంటోంది. మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను చక్కబెడతాం. ఆదివాసీ, దళిత, గిరిజనుల భూములను తిరిగి వారికి ఇప్పిస్తాం. తిరిగి ఇప్పించడమే కాదు...ఆ భూములపై వారికి హక్కులు కల్పిస్తాం’అని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రెండూ ఒక్కటేనని, ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతుంటాయని, ఆ తర్వాత రెండు పార్టీలు కలసి పనిచేస్తుంటాయని చెప్పారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల గొంతును నొక్కేస్తున్నాయని, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని రాహుల్‌ జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత రంగంపై, చిరు వ్యాపారులపై విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని చెప్పారు. 

ప్రధాని స్పందించరేం? 
కాంగ్రెస్‌ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 400 ఉంటే గగ్గోలు పెట్టిన మోదీ... ప్రస్తుతం అదే సిలిండర్‌ ధర రూ. 1,100 దాటినా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ. 70, డిజిల్‌ ధర లీటర్‌కు రూ. 56 ఉండగా గగ్గోలు పెట్టిన మోదీ... ప్రధాని అయ్యాక వాటి ధరలు రూ. 100 దాటించారని.. అయినా పెట్రో ధరల పెరుగుదలపై స్పందించడంలేదని విమర్శించారు. పెరిగిన ధరలు పేదలను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయన్నారు. 

నడుస్తూ.. పరిగెడుతూ.. 
రాహుల్‌ ఆదివారం ఉదయం జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి రాజాపూర్, కేతిరెడ్డిపల్లి, బాలానగర్‌లోని పెద్దాయపల్లి గేట్‌ మీదుగా సాయంత్రానికి రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. పాదయాత్ర రాజాపూర్‌ దాటాక కొందరు చిన్నారులను కలిసిన రాహుల్‌ వారితో కలిసి పరుగు పోటీలో పాల్గొన్నారు. ఆయన ఒక్కసారిగా పరుగెత్తడంతో రేవంత్‌రెడ్డి తదితరులు సైతం పరుగులు పెట్టారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఆయనతో కలిసి కేరింతలు కొడుతూ పరుగు తీశారు. ఐదోరోజు రాహుల్‌ మొత్తంగా 26 కి.మీ. మేర పాదయాత్ర చేశారు.   

మరిన్ని వార్తలు