నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా!

26 Oct, 2022 02:33 IST|Sakshi

అక్కడ జరిగేది ఉప ఎన్నిక కాదు.. కాంగ్రెస్‌ను అంతం చేసే కుట్ర

టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలి

పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. అక్కడ కాంగ్రెస్‌పై కుట్ర జరుగుతోంది. మనల్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పథక రచన చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంచన్‌ దొరా అని బానిసలవుదామా? నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా? తేల్చుకోవాల్సిన సమయం ఇది. నికార్సైన కాంగ్రెసోడా... మునుగోడుకు రా. మీ కోసం ఎదురుచూస్తుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కులమతాలకు అతీతంగా, ఊరూవాడా, పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని, అక్కడ కార్యకర్తలు కదం తొక్కి తాడోపేడో తేల్చుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు వేలాదిగా తరలివచ్చి అద్భుత స్వాగతం పలికిన కేడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారని, కాంగ్రెస్‌ భిక్షతో ఎదిగిన వారే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

పైసాకు పనికిరాని వారు రాజ్యమేలుతూ కాంగ్రెస్‌ను అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆడబిడ్డ అనే భావన కూడా లేకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేషు్టలుగా ఉందామా? తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియాగాంధీకి ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్‌ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్‌ చేసిన నేరమా? సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాం’అని రేవంత్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు