దళిత, గిరిజనుల అభివృద్ధి మా పాలనలోనే..

18 Sep, 2021 02:13 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న ఖర్గే. చిత్రంలో రేవంత్‌రెడ్డి 

భవిష్యత్తులో చేయబోయేది కూడా మా పార్టీయే

దళిత, గిరిజన దండోరా సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఖర్గే

అధికారం అప్పగిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కృషి 

మేం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మోదీ, కేసీఆర్‌లు పుట్టలేదు

సాక్షి, గజ్వేల్‌/ గజ్వేల్‌ నుంచి సాక్షి ప్రతినిధి: దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏది చేసినా అది కాంగ్రెస్‌ పార్టీనేనని, చేయబోయేది కూడా తమ పార్టీయేనని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో అధికారం అప్పగిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన ’దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సభకు రాహుల్‌ గాంధీ హాజరు కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, తనపై ఈ బాధ్యతను పెట్టి ఈ సభకు పంపారని చెప్పారు. 

స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ
‘ఈ దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ గత 70 ఏళ్లలో ఏం చేసిందని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యాక, తెలంగాణలో కేసీఆర్‌ సీఎం అయ్యాక మాత్రమే అభివృద్ధి జరిగి నట్టు చెబుతున్నారు. కానీ అసలు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ వాదులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు మోదీ, కేసీఆర్‌లు పుట్టలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీయే. అయితే అధికారాన్ని అనుభవిస్తోంది మాత్రం కేసీఆర్, ఆయన కుటుంబం..’ అని ఖర్గే విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాం
‘దేశంలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. మెదక్‌ ఎంపీగా ఇందిరా గాంధీని గెలిపిస్తే ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్‌ పార్టీయే. కాంగ్రెస్‌ చెబితే చేసి తీరుతుంది. దళితులు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చేయూతనిచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, ఎస్సీ, ఎస్టీల హక్కులు పరిరక్షింపబడాలన్నా కాంగ్రెస్‌ పార్టీకే మద్దతివ్వాలి..’ అని కోరారు. 


శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు హాజరైన జనం 

మోదీ అమ్ముతుంటారు... వారు కొంటుంటారు
‘ఈ దేశాన్ని మోదీ అమ్ముతుంటే, అంబానీ, అదానీలు కొంటారనే రీతిలో పాలన సాగుతోంది. కేసీఆర్‌ దగాకోరు. సోనియాగాంధీని మోసం చేశారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉంటామని, తన కుటుంబంతో సహా వచ్చి ఫోటోలు దిగి, మద్దతిస్తానని చెప్పి తెల్లారేసరికి మాట తప్పారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత మాట తప్పిన కేసీఆర్‌ను దెబ్బ కొట్టి తీరుతాం..’ అని ఖర్గే అన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాలను గుడ్డి ప్రభుత్వాలుగా మల్లిఖార్జున ఖర్గే అభివర్ణించారు. ఈ రెండు ప్రభుత్వాలకు సరైన దారి చూపెట్టాలంటూ..సభికులు తమ సెల్‌ ఫోన్లలోని లైట్లను వెలిగించాలని కోరారు. వారంతా అలా చేయడంతో రాత్రి సమయంలో సభా ప్రాంగణం కాంతులీనింది. తనదైన శైలిలో కవితలు, సామెతలు చెప్పిన ఖర్గే, సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

2 నుంచి నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ: రేవంత్‌రెడ్డి
 రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. గజ్వేల్‌ సభలో 2 లక్షల మందితో కదం తొక్కామని చెప్పారు. గంజాయి మత్తులో చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్యచేస్తే పోలీసులను పిలిచి కనీసం సమీక్ష చేయని సీఎం కేసీఆర్‌ ఓ మానవ మృగమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌కు డ్రామారావు బ్రాండ్‌ అంబాసిడరని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌ ఓ అవినీతి తోట అని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సాధారణ వ్యక్తి అయిన కేసీఆర్‌ కుటుంబానికి వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు, ఆస్తులు, అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద సాయాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని, రూ.లక్ష కోట్ల సబ్‌ప్లాన్‌ బకాయిలను చెల్లించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కేసీఆర్‌ కుటుంబసభ్యుల్లో ఒకరిని తొలగించి దళితులకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్‌ అంబాసిడర్‌లని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కారును గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సామాజిక న్యాయం, స్వయం పాలన ఉంటుందని చెప్పారు. 

ఏకకాలంలో దళితబంధును అమలు చేయాలి: భట్టి
దళితబంధును హుజూరాబాద్, నాలుగు మండలాలు కాకుండా రాష్ట్రమంతా ఏకకాలంలో అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఇతర వర్గాలకు కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ అవినీతి చిట్టా కట్టలు అన్నీ మోదీ దగ్గర ఉన్నాయని ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రాబందుల సమితిగా కేసీఆర్‌ మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ దీపం ఆరిపోతుంది, కాంగ్రెస్‌ దీపం వెలుగుతుందని రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. దళిత బంధు మాదిరిగా బీసీ బంధు సైతం అమలు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు నేతలు బలరాం నాయక్, మల్లు రవి, సంపత్‌కుమార్, అజారుద్దీన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కుసుంకుమార్, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు