కమీషన్లతో కోట్లకు కోట్లు

3 Oct, 2020 05:43 IST|Sakshi
నిరసన దీక్షాకార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌. చిత్రంలో ఉత్తమ్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ  తదితరులు

సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఏడేళ్ల కాలంలో కేసీఆర్‌ కుటుంబం అత్యంత ధనవంతులయ్యారు. కేసీఆర్‌ అంటేనే.. కమీషన్‌  చంద్రశేఖర్‌రావు అనే అర్థంగా మారిపోయిందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ‘కిసాన్‌ –మజ్దూర్‌ బచావో దివస్‌’ను సంగారెడ్డిలోని గంజ్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ మాట్లాడుతూ.. అంబానీ, అదానీలు వ్యాపారం చేసి సంపాదిస్తే కేసీఆర్‌ కుటుంబం కమీషన్లు తీసుకొని దేశంలోనే ధనవంతులయ్యారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకొని సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే అధికారముందని ఆయన చెప్పారు. కేసీఆర్‌ బాత్‌రూంకు అయ్యే ఖర్చు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కూడా కావడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మిషన్‌ –2023 లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. మోదీ, అమిత్‌ షాలు దేశంలోని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అదానీ, అంబానీల చేతుల్లో భవిష్యత్తు పెట్టారని విమర్శించారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులతో ముంబైలో కూర్చుని వారే పంటలకు ధరలు నిర్ణయిస్తారన్నారు. మోదీ, అమిత్‌ షాలకు కేసీఆర్‌ బీ టీంగా మారారని విమర్శించారు. 

ఆత్మహత్యలు పెరిగాయి..
దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వీరిద్దరూ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు ద్రోహి అని ఘాటుగా విమర్శించారు. ఈ నెల 31 వరకు 2 లక్షల సంతకాలను సేకరించి వచ్చేనెల 14న ఢిల్లీలో రాష్ట్రపతికి అందజేస్తామని పేర్కొన్నారు.  

బిల్లులను ఉపసంహరించుకోవాలి 
రైతు వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులతో రైతులే భవిష్యత్తులో కూలీలుగా మారే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. కేంద్రం ఆమోదించిన బిల్లుల ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బోసురాజు, డీసీసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.కాగా మాణిక్యం ఠాగూర్‌ తన పర్యటనలో భాగంగా శని, ఆదివారాలు కూడా రాష్ట్రంలోనే ఉండనున్నారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు