‘దక్షిణ భారత హిట్లర్‌ కేసీఆర్‌’ 

15 Dec, 2022 01:50 IST|Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దాడిపై లోక్‌సభలో వాయిదా తీర్మానం

కిసాన్‌ సర్కార్‌ కాదు.. లిక్కర్‌ సర్కార్‌ : రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు దక్షిణ భారత హిట్లర్‌లా మారారని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, కవితపై ఎవరైనా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినా పోలీసులు రంగంలోకి దిగుతున్నారని.. దీన్ని బట్టే కేసీఆర్, కేటీఆర్‌ ఎంత పిరికివారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వింగ్‌ కార్యాలయంపై హైద రాబాద్‌లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాడి చేసిన ఘటనపై బుధవారం ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ కార్యాలయంపై దౌర్జన్యం చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం, నాయకులను అరెస్టు చేయడం వంటి అంశాలను ఖండించిన మాణిక్యం.. ఈ అంశాన్ని అత్యవసరంగా చర్చించాలని వాయి దాతీర్మానంలో పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రజా ప్రయోజన అంశాల ప్రస్తావన సమయంలో పోలీ సుల దాడి గురించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎంగా వ్యవహరిస్తున్న ఐటీ శాఖ మంత్రి ఆదేశాల మేరకే పోలీసులు కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై దాడి చేశారని ఆరోపించారు.

పదవులకోసం పోటీ ఎక్కువగా ఉంది..
అనంతరం మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడుతూ, టీపీసీసీ పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉందని అన్నారు. చాలా మంది నేతలు తమకు బాధ్యత కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జాబితాపై అసంతృప్తి ఉంటే పార్టీలోనే చర్చించాలని.. మీడియా ముందుకు వెళ్లొద్దని సూచించారు. తాము ఈ విషయాన్ని ఎంతగా చెప్పినా కొందరు మీడియా ముందుకొచ్చారని.. మీడియాలో రచ్చ చేయడం ఒక రోగ లక్షణమని మండిపడ్డారు. 

మళ్లీ అధికారమిస్తే లిక్కర్‌ సర్కారే: రేవంత్‌
కాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ నాయకుడు పవన్‌ ఖేరాలు, టీపీసీసీ నేత వినోద్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలపై ఈ నేతలు ధ్వజమెత్తారు. కాగా, తెలంగాణలో కేసీఆర్‌కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్‌ సర్కార్‌ కాదని.. లిక్కర్‌ సర్కార్‌ అని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్‌ కొనేశారని, అందుకే సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ ప్రజా సమస్య లపై ప్రభుత్వాన్ని నిలదీస్తోందని స్పష్టం చేశారు.

గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారని.. విమర్శించారు. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలా డుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌కు సహకరించవద్దని కుమారస్వామి, అఖిలేశ్‌లను కోరుతున్నా మన్నారు. తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే భయంతో కేటీఆర్‌ తండ్రిపై అలిగారని ఆరోపించారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదన్నారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారినా ఆ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండ దని, తమది యాంటీ కేసీఆర్‌ విధానమని రేవంత్‌ స్పష్టం చేశారు. కాగా లిక్కర్‌ స్కాంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసునని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టామని.. ఆ పోస్టుతో రాష్ట్ర పోలీసులకు ఏం ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు