ఓట్లు కాదు.. సీట్లు కావాలె!

4 Dec, 2023 10:37 IST|Sakshi

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీకైనా.. పార్లమెంటుకైనా అధికారం దక్కాలంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించుకోవాలి. కొత్త విషయమేమీ కాదు. అయితే ఇటీవలే ముగిసి ఆదివారం కౌంటింగ్‌ జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికలను పరిశీలిస్తే ఒక విచిత్రమైన వాస్తవం బయటకొస్తుంది. ఈ నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎందరు ఓటేశారో చూస్తే కాంగ్రెస్‌ పార్టీ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపినట్లుగా స్పష్టమవుతుంది. కానీ... సీట్ల విషయానికి వస్తే మాత్రం పరిస్థితి తారుమారైనట్లు తెలుస్తుంది. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీకి మూడు రాష్ట్రాల్లో ఓటమి ఎదురైంది. తెలంగాణలో మాత్రమే అధికారం దక్కగా, రాజస్థాన్‌,,చత్తీస్‌గఢ్‌లలో చేజారింది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే తక్కువ ఓట్లు సాధించినా మధ్యప్రదేశ్‌లో అధికారం నిలుపుకోగలిగింది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో తాజాగా అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. ఆదివారం జరిగిన నాలుగు రాష్ట్రాల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ మొత్తం 4,90,69,462 సాధించగా... బీజేపీ 4,81,29,325 ఓట్లు కూడగట్టుకోగలిగింది. అంటే ఇరు పార్టీల మధ్య తేడా 940137 లక్షల ఓట్లు మాత్రమే.  

రాజస్థాన్‌లో 2 శాతం ఓట్లనే తేడా!
రాజస్థాన్‌లో  బీజేపీ సాధించిన ఓట్లు 1,65,23,568 కాగా, కాంగ్రెస్‌ సాధించిన ఓట్లు 1,56,66,731. అంటే ఇరు పార్టీల మధ్య ఓట్ల వ్యత్సాసం 8,56,837లుగా ఉంది. రాజస్థాన్‌లో బీజేపీ 41.69 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌ 39.53 శాతానికి పరిమితమైంది. కానీ సీట్ల పరంగా ఇరుపార్టీల మధ్య అంతరం 46గా ఉంది. మొత్తం 199 స్థానాలున్న రాజస్థాన్‌లో బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్‌ 69 సీట్లకే పరిమితమైంది. అంటే సుమారు రెండు శాతం ఓట్ల శాతంలో కాంగ్రెస 40కి పైగా స్థానాల్ని కోల్పోయింది. 

కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు.. అయినా బీజేపీదే అధికారం!
ఇక చత్తీస్‌గడ్‌లో బీజేపీకి 72,34,968 ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 66,02,586కు అంటే ఈ పార్టీల మధ్య ఓట్ల తేడా సుమారు 632382 మాత్రమే. శాతాల వారీగా చూసుకుంటే బీజేపీ 46.27 శాతం కాంగ్రెస్‌ 42.23 శాతం సాధించాయి. అంటే ఇక్కడ వ్యత్యాసం  కాస్త అటు ఇటుగా నాలుగు శాతం మాత్రమే. 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోగా, కాంగ్రెస్‌ 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

8 శాతం ఓట్లు తేడా.. 97 సీట్లు కోల్పోయిన కాంగ్రెస్‌
మధ్యప్రదేశ్‌లో  బీజేపీకి 2,11,13,278 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 1,75,64,353 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ శాతంలో వ్యత్యాసం మాత్రం సుమారు 8శాతం, బీజేపీకి 48.55 శాతాన్ని సాధించగా, కాంగ్రెస్‌ 40.40 శాతాన్ని నమోదు చేసింది. ఈ ఎనిమిది శాతం ఓట్ల వ్యత్యాసంలోనే కాంగ్రెస్‌ 97 సీట్లను చేజార్చుకుంది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధిస్తే.. కాంగ్రెస్‌ 66 స్థానాలకే పరిమితమైంది.

తెలంగాణలో తిరుగులేని కాంగ్రెస్‌
ఇక తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్‌ సాధించిన ఓట్ల శాతం 39.40 శాతంగా ఉంది. ఇక్కడ బీజేపీకి 13.90 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ​తెలంగాణలో కాంగ్రెస్‌ 64 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకోగా, బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ తెలంగాణ కంటే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎక్కువ ఓటింగ్‌ శాతాన్ని నమోదు చేసినా అధికారానికి మాత్రం దూరం కావడం గమనార్హం. అంటే అధికారం చేజిక్కించుకోవాలంటే కావాల్సింది ఓట్లు కాదు.. అంతిమంగా సీట్లే కావాలనేది మనకు మరొకసారి తెలుస్తున్న విషయం.

ఓట్ల శాతం 40శాతానికి పైగా ఉండి ఇలా మూడు రాష్ట్రాల్లో భారీగా సీట్లను కోల్పోవడం కాంగ్రెస్‌ను ఆయా రాష్ట్రాల్లో అధికారానికి దూరం చేసింది. కానీ ఓవరాల్‌గా చూస్తే కాంగ్రెస్‌ ప్రజాదరణకు చేరువైందనే విషయం కాదనలేని వాస్తవం. 

>
మరిన్ని వార్తలు