ప్రశాంత్‌ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం..!

27 Sep, 2020 12:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు హస్తం పార్టీ సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగానే ప్రశాంత్‌ కిషోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్‌ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే ప్రశాంత్‌ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చోవాలని సీఎం నిర్ణయించారు. మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపల్పన వంటి అంశాలపై చర్చించాలని ప్రణాళికలు‌ రచించారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్‌ శాసనసభ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, శిరోమణీ అకలీదళ్‌, ఆమ్ఆద్మీ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

దశాబ్ధాలుగా బీజేపీతో ఉన్న స్నేహనికి అకాలీదళ్‌ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సుఖ్బీర్‌సింగ్‌ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రశాంత్‌ సేవలను ఉపయోగించుకోవాలని అమరీందర్‌ సింగ్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ప్రశాంత్‌ కృషి చేసిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఫలితాలనే పునరావృత్తం చేయాలనుకుంటున్న కెప్టెన్‌.. వ్యూహకర్తతో ఒప్పందానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రతిపాదనకు ప్రశాంత్‌ ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఇరు వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(ప్రశాంత్‌ కిషోర్‌కు పోటీగా సునీల్‌)

గతంలో అనేక మందికి వ్యూహకర్తగా వ్యహరించి విజయాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో జట్టు కట్టేందుకు ప్రశాంత్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. త్వరలో జరుగనున్న తమిళనాడు అసెం‍బ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీలతో ప్రశాంత్‌ ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరంద్రే మోదీని అద్భుతమైన విజయాన్ని అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మరిన్ని వార్తలు