మునుగోడు ఉప ఎన్నిక: టికెట్‌ రెడ్డికా.. బీసీకా?

26 Aug, 2022 05:27 IST|Sakshi

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు 

ఆశావహులతో గాంధీభవన్‌లో రేవంత్, భట్టి, దామోదర్‌రెడ్డి చర్చలు 

స్రవంతి, పల్లె రవి, కైలాశ్, కృష్ణారెడ్డిల అభిప్రాయాల సేకరణ 

ఎంపీ కోమటిరెడ్డి, మాణిక్యంతో భట్టి వేర్వేరుగా భేటీ 

మునుగోడు ప్రచారానికి వెళ్తా: కోమటిరెడ్డి 

ఢిల్లీకి చేరిన టీపీసీసీ జాబితా.. అధిష్టానం ఆమోదమే తరువాయి

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీ లేదా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యుల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బీసీ వర్గాలకు టికెట్‌ కేటాయించే యోచనలో ఉన్న రాష్ట్ర పార్టీ పెద్దల వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మునుగోడు అభ్యర్థి ఎంపిక కోసం గురువారం గాంధీభవన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిలతో పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడు ఆర్‌.దామోదర్‌రెడ్డి ఆ నలుగురు ఆశావహులతో విడివిడిగా భేటీ అయ్యారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? మళ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయముంది, అయినా బరిలో ఉంటారా? బలం ఏంటి? బలహీనత ఏంటి? డబ్బులే ప్రాతిపదికగా ఎన్నికలు నడిస్తే ఏం చేస్తారు? రెండు ప్రభుత్వాలను ఎలా ఢీ కొడతారు? మీ ప్రణాళిక ఏంటి? అనే ప్రశ్నలను అడిగి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. 

ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం 
భేటీ అనంతరం ఆశావహులు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి చెప్పామని, తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో ఫోన్‌లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌ నుంచి నేరుగా పుణే వెళ్లిపోయారు. భట్టి, దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మాణిక్యంతో భేటీ అయ్యారు.

ఆ తర్వాత సాయంత్రం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. మునుగోడు అభ్యర్థి విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వెంకట్‌రెడ్డి నివాసం నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన భట్టి అక్కడ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి రేవంత్, మధుయాష్కీ, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లాడి మూడు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. ఈ జాబితాలో ఒక పేరును పార్టీ అధిష్టానం ఆమోదించి అధికారికంగా ప్రకటించనుంది.  

మరిన్ని వార్తలు