Hyderabad: గత వైభవాన్ని పుణికిపుచ్చుకోని కాంగ్రెస్‌

6 Jun, 2022 07:59 IST|Sakshi

కేడర్‌లో ఉత్తేజమున్నా నాయకత్వంలో నైరాశ్యం

రెండేళ్లుగా నగర సారథిని నియమించని వైనం 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ అధిష్టానానికి గ్రేటర్‌పై కనీస దృష్టి లేకుండాపోయింది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన మహానగరంలో సుమారు 24 నియోజక వర్గాలు ఉన్నా.. వాటిపై కనీస వ్యూహరచన లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నగర పర్యటనతో కేడర్‌లో కొంత జోష్‌ వచ్చి ప్రజా సమస్యలపై పోరాటానికి సై అంటున్నా.. సారథ్యం వహించే నాయకులు లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న ట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.    

వరుస ఓటములతో... 
రాష్ట్ర ఆవిర్భావానంతరం వరుస ఓటములతో కాంగ్రెస్‌ కుదేలైంది. సంస్థాగతంగానూ బలహీనపడింది. గతంలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్‌ నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యలో ఉండేవారు.  దానం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు పార్టీ గ్రేటర్‌ బాధ్యతలు అప్పగింంచారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ హవాలో పార్టీ పక్షాన ఇద్దరు గెలిచినా.. వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారింది.   

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం ఆరు శాతం ఓట్లు సాధించి రెండు సీట్లకు పరిమితం కాగా, అనంతరం ఉప ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌ను దక్కించుకొని మూడు డివిజన్లకు పరిమితమైంది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రేటర్‌ అధ్యక్షుడి పదవికి అంజన్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అధ్యక్ష పీఠం ఖాళీ అయి రెండేళ్లయినా.. బాధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడం అధిష్టాన వర్గం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.   

ముఖ్యనేతల తీరుతో అచేతనం.. 
గ్రేటర్‌లో ముఖ్యనేతల తీరు పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నగరంలోని నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు  సిద్ధంగా ఉండే ముఖ్య నేతలంతా గాంధీభవన్‌కు, మీడియా ప్రెస్‌మీట్, ప్రెస్‌నోట్‌లకే పరిమితమయ్యారు. స్ధానిక ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్టీలోని ముఖ్యనేతల్లో చాలా మంది  అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో రాష్ట్రస్థాయి మహిళా కాంగ్రెస్, యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాలు మినహా ఎలాంటి స్థానిక  కార్యక్రమాలు జరగడం లేదు. నగర సమస్యలను ఇదే విధంగా వదిలేస్తే  రానున్న ఎన్నికల్లో గత పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితి లేకపోలేదన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

సంస్థాగతంగానూ బలహీనమే.. 
సంస్థాగతంగానూ కాంగ్రెస్‌ బలహీనపడింది. ఇటీవల అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత పార్టీ సభ్యత్వ సేకరణ ఆశించిన స్థాయిలో జరగలేదు. గతంలో బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు సైతం సభ్యత్వ నమోదులోనూ వెనుకబడటంపై తీవ్ర అసంతప్తి వ్యక్తమైనా.. కనీసం క్షేత్ర స్థాయి పోస్టుమార్టం లేకుండాపోయింది. మెజారిటీ డివిజన్లలో పార్టీకి బలమైన నాయకుడు కూడా లేరు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక గ్రేటర్‌ హైదరాబాద్‌ పార్టీ పరిస్థితిపై రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టిన దాఖలాలు లేవని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు