కాంగ్రెస్-శివసేన మధ్య రాజుకున్న వివాదం

1 Jan, 2021 16:33 IST|Sakshi

అగ్గిరాజేస్తున్న జౌరంగబాద్‌

సాక్షి, ముంబై : మహారాష్ట్రంలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఔరంగాబాద్‌ పేరు మార్చాలని అధికార శివసేన చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్‌ పేరు మార్చడానికి ఏదైనా ప్రతిపాదన వస్తే, తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్, మంత్రి బాలాసాహెబ్‌ థోరాట్‌ స్పష్టంచేశారు. స్థలాల పేర్లు మార్చడం శివసేన నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వ కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌లో భాగం కాదని ఆయన తెలిపారు. పేర్లు మార్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, సామాన్యుడి అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడదని, అందుకే కాంగ్రెస్‌కు పేర్ల మార్పుపై నమ్మకం లేదన్నారు. కాగా, ఔరంగాబాద్‌ పేరు మారుస్తున్నట్లు తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని థోరాట్‌ వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా.. పలువురు నేతలు మాత్రం మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం రాజుకుంటోం​ది. (ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్‌.. వేడెక్కిన రాజకీయం)

రెండు దశబ్ధాల కిందట ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మర్చాలని శివసేన డిమాండ్‌చేసిన సంగతి తెలిసిందే. 1995 జూన్‌లో జరిగిన ఔరంగాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో సైతం ఈ ప్రతిపాదనను ఆమోదించారు, దీనిని హైకోర్టులో, తరువాత సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు సవాలు చేశారు. శివసేనకు సోనియా లేఖపై ప్రశ్నించగా మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు సోనియాకూడా కారణమని థోరాట్‌ గుర్తుచేశారు. శరద్‌ పవార్‌ మాదిరిగానే, సోనియా గాంధీకి కూడా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే అధికారం ఉందని ఆయన అన్నారు.

రాయడం జర్నలిస్టుల హక్కు..
ఇక సామ్నాలో కాంగ్రెస్‌ ఇపుడు బలహీనంగా ఉందని వార్తలు రావడంతో.. అలా రాయడం జర్నలిస్టుగా వారి హక్కు అని థోరాట్‌ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఉద్ధవ్‌ ఠాక్రే అలా మాట్లాడితే అది వేరే విషయం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ బలంగా ఉందని, గతంలో శాసనమండలి ఎన్నికలలో మేం దీనిని నిరూపించామని మంత్రి అన్నారు. ప్రతి పార్టీ సమస్యలను ఎదుర్కొంటుందని, కాని మాకు మళ్లీ బలంగా ఉండగల సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. ఇక శాసనమండలికి నామినేట్‌ చేయబోయే 12 మంది సభ్యుల జాబితాపై విలేకరులు ప్రశ్నించగా త్వరలో పరిష్కారం లభిస్తుందని థోరాట్‌ బదులిచ్చారు. ఆయన కొంత సమయం తీసుకున్నారని, త్వరలో సంతకం చేసి ప్రతిపాదన అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు