ప్రధాని మోదీ ప్రసంగం; కాంగ్రెస్‌ విమర్శలు!

15 Aug, 2020 16:10 IST|Sakshi

పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఏకే అంటోని

ప్రభుత్వంపై రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శలు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న చైనా పేరును ఎత్తడానికి పాలకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా బలగాలను వెనక్కి పంపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్‌ చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని పేర్కొంది.

అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయాలపై దేశమంతా ఏకతాటిపైకి వచ్చి పాలకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను హరిస్తున్న వాళ్లపై ఒక్కటిగా పోరాడటమే నిజమైన జాతీయవాదం అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాల శనివారం నరేంద్ర మోదీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చైనా పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.(ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ)

కాగా 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘ భారత ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసు బలగాల సేవల పట్ల మనమంతా గర్వపడుతున్నాం. శత్రువుల దాడి నుంచి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ రక్షణగా నిలుస్తున్నందున 130 కోట్ల మంది భారతీయులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వారిని తలచుకుని గర్విస్తున్నారు. కానీ మన పాలకులు మాత్రం ఎందుకో చైనా పేరును ఎత్తడానికి చాలా భయపడుతున్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిన విషయాన్ని దాచిపెడుతున్నారు. దీని గురించి మనమంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. (కనీస వివాహ వయస్సు నిర్ధారణకై కమిటీ)

అదే విధంగా ఆత్మనిర్భర్‌ గురించి ప్రసంగాలు చేస్తున్న వారు, దానికి పునాది వేసింది పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌ సహా స్వాతంత్ర్య సమరయోధులు అని గుర్తు పెట్టుకోవాలి. రైల్వే, ఎయిర్‌పోర్టులు వంటి 32 ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారో మనం సర్కారును నిలదీయాలి. ఎల్‌ఐసీ, ఎఫ్‌సీఐని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో ప్రశ్నించాలి. స్వేచ్ఛను హరిస్తున్న వారిపై పోరాటానికి సిద్ధం కావాలి’’ అంటూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరు కారణంగా సీనియర్‌ నేత ఏకే ఆంటోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాహుల్‌ గాంధీ, సూర్జేవాల తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న శత్రుదేశ సైన్యాలకు భారత జవాన్లు దీటుగా జవాబిస్తున్నారని, వారి త్యాగఫలితంగానే మనమంతా సురక్షితంగా ఉన్నామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు