కుష్బూకు హైకమాండ్‌ షోకాజ్‌ నోటీస్‌!?

2 Aug, 2020 10:24 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటి కుష్బూకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. నటి కుష్బూను ఫైర్‌బ్రాండ్‌గా పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారీమె. ఆ మధ్య డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివాదాలకు కేంద్ర బిందువుగా మారే కుష్బూ ఆ మధ్య రజనీకాంత్‌ ఒక వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో రజనీ వివరణ ఇచ్చారు. అప్పుడు కుష్బూ రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు.

తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని కాంగ్రెస్‌ ప్రచార కర్త కుష్బూ స్వాగతిస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతే కాదు కుష్బూ బీజేపీలో ఉన్నత పదవి వస్తుందనే ఆశతో పార్టీని మారడానికి సిద్ధం అవుతున్నారనే ఆరోపణలను చేస్తున్నారు. దీనికి స్పందిచిన కుష్భూ తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ కాంగ్రెస్‌ పార్టీలో ఉందని పేర్కొన్నారు. (కమలం వైపు కుష్బూ చూపు)

అదేవిధంగా తన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే రాహుల్‌గాందీకి క్షమాపణ చెప్పుకుంటానని, అంతే కానీ తాను తల ఆడించే రోబో బొమ్మగా ఉండలేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన కుష్బూపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎస్‌.అళగిరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు, కుష్బూకు వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.  (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు)

మరిన్ని వార్తలు