కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు వాయిదా

11 May, 2021 05:07 IST|Sakshi

కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌

సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం

నాలుగు రాష్ట్రాల ఓటమి నుంచి కాంగ్రెస్‌ గుణపాఠాలు నేర్చుకోవాలన్న సోనియా

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన అనంతరం 2019 ఆగస్ట్‌ నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతుండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని గత కొంతకాలంగా సోనియాగాంధీ భావిస్తున్నారు. అందులోభాగంగా జూన్‌లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు.

సోమవారం వర్చువల్‌ వేదికగా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై చర్చించారు. అయితే దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు విషమించిన కారణంగా అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయడమనే సబబు అని సీడబ్ల్యూసీ సభ్యులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. దీంతో సంక్షోభం సద్దుమణగగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడితే మూడు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చెప్పారు.

మోదీ తన తప్పులు సరిదిద్దుకోవాలి
సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా విస్తృత వ్యాప్తిపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిన తప్పుకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మోదీ తన తప్పులను సరిదిద్దుకోవాలని, వ్యక్తిగత ఎజెండాను పక్కనబెట్టాలని దేశానికి సేవ చేయాలని సీబ్ల్యూసీ హితవుపలికింది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం వాస్తవ గణాంకాలను బహిర్గతంచేయడంలేదని ఆరోపించింది.

నిజాన్ని దాచేస్తే సరిపోదని, సవాళ్లను ఎదుర్కొంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, కరోనా కట్టడి కోసం చేపట్టే చర్యలు, కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీబ్ల్యూసీ నిర్ణయించింది. కరోనా వైరస్‌ పరిస్థితి చాలా భయంకరంగా మారిందని సోనియా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా వైఫల్యాలు ఎక్కువై పరిస్థితులు మరింత కష్టతరంగా మారాయని వ్యాఖ్యానించారు. వైరస్‌ సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లను ప్రభుత్వం వారి ప్రయోజనం కోసం ఆమోదించిందని విమర్శించారు.

నత్తనడకన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌
ఈ సమావేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సోనియా గాంధీ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మోదీ ప్రభుత్వం తన బాధ్యతను విరమించుకుందని, ఆ బాధ్యతను రాష్ట్రాలపై వదిలేసిందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడం ఆర్థికంగా మరింత సమర్థించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ కారణంగా దేశంలో పరిస్థితి మరింత భయంకరంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. పాలన వైఫల్యాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన  కొనసాగుతోందన్నారు.

ప్రజాభిప్రాయాలు, సద్విమర్శలను పక్కకునెట్టి మోదీ సర్కార్‌ తన స్వప్రయోజనాలు, ఇతర భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందన్నారు.  ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాభీష్టానికి తగ్గట్లు కోవిడ్‌ చర్యలు చేపట్టాలని సోనియా కోరారు. ఢిల్లీలో కోవిడ్‌కాలంలోనూ కొనసాగుతున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వృథాగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం దేశానికి సహాయం చేయడానికి ముందుకొస్తున్న అన్ని దేశాలకు, సంస్థలకు కాంగ్రెస్‌ తరపున సోనియా కృతజ్ఞతలు తెలిపారు.  ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పేలవమైన పనితీరును సమీక్షించారు.

ఎన్నికల ఫలితాలతో చాలా నిరాశ చెందుతున్నామని చెబితే సరిపోదని, ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సోనియా తెలిపారు. కేరళ, అస్సాంలో మనం ఎందుకు ఓడిపోయామో, పశ్చిమ బెంగాల్‌లో కనీసం ఒక్క సీటు ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. మనం వాస్తవికతను అర్థంచేసుకోకపోతే, భవిష్యత్తు కోసం ఎలా పాఠాలు నేర్చుకుంటామని సోనియా గాంధీ సభ్యులను ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల ఓటమి నుంచి కాంగ్రెస్‌ గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. పార్టీ ఓటమికి గల వాస్తవ కారణాలను తెలపాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లను సోనియా ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా ఈ చర్చలో రాహుల్‌గాంధీ పాల్గొనలేదు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు