దిగ్విజయ్‌తో థరూర్‌ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

29 Sep, 2022 18:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్‌ నేతలు శశి థరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పోటీపై ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు శశి థరూర్‌. ‘ఇది ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ కాదు.. సహచరుల మధ్య జరిగే స్నేహపూర్వక పోటీ’ అని పేర్కొన్నారు.

శశిథరూర్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు దిగ్విజయ్‌ సింగ్‌. శశి థరూర్‌ వ్యాఖ్యాలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీ మతత్వత శక్తులకు వ్యతిరేకంగా జరుగుతోందని, తాము ఇరువురు గాంధీయన్‌, నెహ్రూవియన్‌ భావజాలాలను నమ్ముతామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. ఇరువురు నేతలు తమ నామినేషన్‌ పత్రాలను శుక్రవారం దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్‌ పత్రాలను శశిథరూర్‌.. వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం తీసుకున్నారు.

ఇదీ చదవండి: Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్‌ గహ్లోత్‌

మరిన్ని వార్తలు