బంగారు భారతాన్ని నిర్మిద్దాం.. తెలంగాణ ప్రజలకు రాహుల్‌ సందేశం రెడీ

28 Jan, 2023 07:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 133 రోజుల క్రితం కన్యాకుమారిలో ప్రారంభమైన ‘భారత్‌జోడో యాత్ర’కు కొనసాగింపుగా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో జరగనున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల కోసం దేశ ప్రజలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని పంపారు. ఈ సందేశాన్ని తెలుగులోనికి అనువదించిన టీపీసీసీ ఆ సందేశంతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలతో కూడిన చార్జిషీట్‌ను నాలుగు పేజీల కరపత్రంలో పొందుపరిచింది.

ప్రతి భారతీయుడు కలలు కనే సమాజాన్ని, వాటిని నెరవేర్చుకునేందుకు సమాన అవకాశాలున్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుదామని, బంగారు భారతాన్ని నిర్మిద్దామని రాహుల్‌గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశం పొందుపరిచిన కరపత్రాన్ని హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గడపకూ కాంగ్రెస్‌ శ్రేణులు అందజేయనున్నాయి. ఈ మేరకు యాత్రల ప్రచార సామగ్రిని గాంధీభవన్‌ నుంచి క్షేత్రస్థాయికి పంపే ఏర్పాట్లలో గాంధీభవన్‌ వర్గాలు నిమగ్నమయ్యాయి.

మరోవైపు ఫిబ్రవరి ఆరో తేదీన భద్రాచలంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను ప్రారంభించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున లక్షమందితో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు సోనియా, ప్రియాంకా గాంధీల్లో ఒకరిని ఆహ్వానించేందుకు ఇప్పటికే ఏఐసీసీకి లేఖ రాసింది.

సబ్‌కే సాత్‌ విశ్వాస్‌ ఘాత్‌
దేశంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానా లన్నింటినీ విస్మరించిందని, బీజేపీ భ్రష్ట్‌ జుమ్లా పార్టీ అని హాథ్‌ సే హాథ్‌ జోడో చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. కుచ్‌కాసాత్‌ ఖుద్‌కా వికాస్, సిర్ఫ్‌ ప్రచార్‌ ఔర్‌ పరివార్‌ వాద్, సబ్‌కేసాత్‌ విశ్వాస్‌ ఘాత్, కుచ్‌కా సాథ్‌ ఖుద్‌కా వికాస్, సబ్కేసాథ్‌ విశ్వాస్‌ ఘాత్‌ లాంటి నినాదాలను ఈ చార్జిషీట్‌లో పొందుపరిచారు. మోదీ ప్రతిష్టను పెంచేందుకు బీజేపీ రూ.10వేల కోట్లను ఖర్చు చేసిందని, రూ.5వేల కోట్లకు ఆ పార్టీ పడగలెత్తిందని, ఎలాంటి పారదర్శకత లేకుండానే 90% ఎన్ని కల బాండ్లు బీజేపీకి దక్కాయన్నారు.
చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌

మరిన్ని వార్తలు