కాంగ్రెస్‌ ‘పవర్‌’పంచ్‌: గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు

8 May, 2021 08:32 IST|Sakshi

ఆ మంత్రుల భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి

గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

 దళితుల భూములు, దేవుడి మాన్యాలనూ వదలలేదని తీవ్ర విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ ‘పవర్‌’పంచ్‌ విసిరింది. 10 మంది మంత్రులపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. దొంగలముఠాలా ఏర్పడి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తింది. పేదల భూములపై రాబందుల్లా వాలిపోయి కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించింది. మంత్రుల అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్‌ సక్రమంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదని, అందుకే సిటింగ్‌ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’పేరిట శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలు తారస్థాయికి చేరాయని, కొందరు మంత్రులైతే దళితుల భూములు, దేవుడి మాన్యాలను కూడా వదలడంలేదని ఆరోపించారు. భూకబ్జాలపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూమ్‌యాప్‌ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు అనిల్‌యాదవ్, రోహిత్‌లు పాల్గొన్నారు. ఆయా మంత్రులపై సంపత్‌ కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చేసిన ఆరోపణలు ఈవిధంగా ఉన్నాయి... 

  • మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ ఎంపీ రేవంత్‌ ఆధారాలతోసహా బయటపెడితే ఆయన్ను జైలుకు పంపారు. దేవరయాంజాల్‌ దేవాలయ భూములను కేటీఆర్‌ ఆక్రమించారు. 
  • దేవరయాంజాల్‌ భూముల్లోనే మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మల్లారెడ్డి బ్యాంక్‌ లాంటివాడు కాబట్టే కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు.  
  • మంత్రి గంగుల కమలాకర్‌ భూముల విషయమై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే కోర్టులో కేసు వేశారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలూ లేవు.  
  • నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు భూములను మంత్రి పువ్వాడ అజయ్‌ అప్పనంగా అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ మారినందుకు రూ.50 కోట్ల విలువైన భూమి, మంత్రి పదవిని ఇచ్చారు. 
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించారు. 200 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ కట్టుకుని విలాసవంతంగా జీవిస్తున్నారు.  
  • మరోమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా భూకబ్జాల్లో ఆరితేరారు.  
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అయితే కుష్టు ఆసుపత్రి భూముల్ని కూడా వదల్లేదు.  
  • మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ఎన్నిసార్లు భూకబ్జా ఆరోపణలు వచ్చినా కేసీఆర్‌ పట్టించుకోరు. 
  • మంత్రులు ఎర్రబెల్లి, మహమూద్‌ అలీలపై వచ్చి న ఆరోపణలను కూడా సీఎం కేసీఆర్‌ పెడచెవిన పెడుతున్నారు.

రాబందుల్లా పడ్డారు: ఉత్తమ్‌ 
కాంగ్రెస్‌ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేస్తే టీఆర్‌ఎస్‌ నేతలు వాటిని కబ్జా చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఒకవైపు సీఎం కేసీఆర్‌ చెబుతుండగా, మరోవైపు తన కేబినెట్‌ సహచరులు రాబందుల్లా వారి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. వీరంతా దొంగల ముఠాలాగా ఏర్పడి అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. భూదందాలకు పాల్పడిన మంత్రులను శిక్షించాలని రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయనున్నట్టు ఉత్తమ్‌ వెల్లడించారు.
చదవండి: Etela Rajender: రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు

మరిన్ని వార్తలు