కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!

5 Dec, 2020 14:12 IST|Sakshi

బీజేపీ నుంచి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక బరిలో..!

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి జానారెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగావేయాలని పావులు కదుపుతున్న బీజేపీ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలపై గాలంవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రఘువీర్‌రెడ్డితో బీజేపీ రాష్ట్ర నేతలు సైతం ఇదివరకే సంప్రదింపులు జరిపారని, టికెట్‌ ఆఫర్‌ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కమలం ఆఫర్‌తో ఆలోచనలోపడ్డ రఘువీర్‌.. తన తండ్రితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. (కాంగ్రెస్‌ ఓటమి.. రేవంత్‌ వర్గంలో ఆశలు)

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచిపట్టున్న జానారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తమకూ లాభిస్తుందని కాషాయదళం లెక్కలువేస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి.. కుమారుడి భవిష్యత్‌ కోసం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి కోరగా.. ఆయన అభ్యర్థనను కాంగ్రెస్‌ అధిష్టానం తిరస్కరించింది. దీంతో అయిష్టంగానే బరిలో నిలిచి.. ఊహించని విధంగా ఓటమి చెందారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్‌ ఫలితంతో జోరుమీదున్న కాషాయదళం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌ సీనియర్లు, అసంతృప్తులను ఆకర్షిస్తోంది.

బీజేపీ గూటికి మాజీ మంత్రి...
గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి ఊహించిన షాక్‌ ఎదురైంది. ఆ పార్టీ మాజీమంత్రి, వికారాబాద్‌కు చెందిన సీనియర్‌ నేత చంద్రశేఖర్ గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భేటీ నిర్వహించనున్నారు. వారి అభిప్రాయం తీసుకున్న అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా