చింతన్‌ శిబిర్‌ వేళ కాంగ్రెస్‌కు షాక్‌.. సీనియర్‌ నేత సునీల్‌ జాఖడ్‌ గుడ్‌బై

15 May, 2022 12:39 IST|Sakshi

చండీగఢ్‌: చింతన్‌ శిబిర్‌ పేరుతో మేధో మథనం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు, దివంగత నేత బలరాం జాఖడ్‌ కుమారుడు, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ షోకాజ్‌ నోటీసివ్వడం, పదవుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి లోనై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్‌ లక్‌. అండ్‌ గుడ్‌బై కాంగ్రెస్‌’’ అని శనివారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రకటించారు.

చింతన్‌ శిబిర్‌ను ప్రహసనంగా అభివర్ణించారు. దానికి బదులు కాంగ్రెస్‌ ‘చింతా’ శిబిర్‌ నిర్వహించాలన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో మంచి నాయకుడు రాహుల్‌ గాంధీయేనన్నారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. జాఖఢ్‌ వంటి నాయకున్ని వదులుకోవద్దని పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు.  

మరిన్ని వార్తలు