Tejashwi Yadav: అక్కడేం చర్చించారో నాకు తెలియదు

28 Jun, 2021 02:17 IST|Sakshi

ఎన్డీయే వ్యతిరేక కూటమికి కాంగ్రెస్‌ ఇరుసులా ఉండాలి 

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) వ్యతిరేక కూటమికి కాంగ్రెస్‌ ఇరుసు కావాలని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్‌ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన జాతీయ పార్టీగా సహజంగానే కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ కూటమికి మూలస్తంభం కావాలన్నారు. తేజస్వి ఆదివారం పీటీఐతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 200 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు నేరుగా బీజేపీతోనే పోటీ నెలకొందని, హస్తం పార్టీ వాటిపై దృష్టి కేంద్రీకరించి... మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఢిల్లీ నివాసంలో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల, వివిధ రంగాల ప్రముఖుల భేటీ గురించి అడగ్గా... అక్కడేం చర్చించారో తనకు తెలియదని తేజస్వి బదులిచ్చారు. నియంతృత్వ పోకడలతో విభజన రాజకీయాలు, అణిచివేతకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లడం తప్పనిసరని ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో తేజస్వి కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం.   

మరిన్ని వార్తలు