గహ్లోత్‌కు మద్దతుగా సచిన్‌ వర్గం!

10 Aug, 2020 14:33 IST|Sakshi
పాత చిత్రం

చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్న కాంగ్రెస్‌ 

ఖండించిన పైలట్‌ వర్గం

జైపూర్‌: అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలమైన సచిన్‌ పైలట్‌ వర్గం ఎట్టకేలకు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్‌ వర్గంతో కాంగ్రెస్‌ అధిష్టానం జరుపుతున్న చర్చలు సానూకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జరుపుతున్నచర్చల్లో పురోగతి కనిపిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. చివరగా ప్రియాంక గాంధీ, సచిన్‌ల భేటీతో ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయని కాంగ్రెస్‌ భావిస్తుంది. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, తిరుగుబాటు ఎమ్మెల్యేలు గహ్లోత్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను పైలట్‌ వర్గం ఖండించింది. గహ్లోత్‌ను ముఖ్యమంత్రి  పదవి నుంచి తొలగిస్తేనే మద్దతుగా నిలుస్తామని ఆయన వర్గం పేర్కొంది. 
(చదవండి : సత్యం పక్షాన నిలబడండి: గహ్లోత్‌)

 అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్ తో పాటు పలువురు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవులు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రియాంక గాంధీ పైలట్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇరువర్గాలు చర్చలు ముమ్మరం చేశాయి.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే  స్వాగతిస్తామని గహ్లోత్‌ పేర్కొనగా, గహ్లోత్‌ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేది లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. మరో వైపు తిరుబాటు చేసిన19 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే విశ్వాస పరీక్షలో నెగ్గాలని గహ్లోత్‌ భావిస్తున్నారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. విశ్వాస పరీక్షలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఆదివారం లేఖలు రాశారు.‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’అని లేఖలో వ్యాఖ్యానించారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్‌కు తరలించింది. 

మరిన్ని వార్తలు