రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

12 Jan, 2024 03:17 IST|Sakshi

సీఎం రేవంత్‌తో మున్షీ చర్చలు పూర్తి.. ఢిల్లీలో భట్టి అభిప్రాయ సేకరణ 

అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌ గౌడ్, షబ్బీర్‌ అలీ, ఫిరోజ్‌ఖాన్‌ పేర్ల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్‌ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్‌ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్‌ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం.

వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్‌ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్‌ రమేశ్‌రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్‌పెద్దలున్నట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు