Munugode Politics: మునుగోడుపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌

11 Aug, 2022 02:19 IST|Sakshi

మండలాల వారీగా టీమ్‌లను నియమిస్తున్న టీపీసీసీ

కార్యాచరణపై బోసురాజు, మహేశ్‌కుమార్‌గౌడ్,దామోదర్‌ రెడ్డి భేటీ

నేడు సమావేశం కానున్న మాణిక్యం ఠాగూర్, రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 9 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’ల అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. అందులోభాగంగా ఈనెల 16 నుంచి కీలక నాయకులందరూ మండలాల వారీగా పర్యటించనున్నారు.

తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈనెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నందున పార్టీ కేడర్‌ ఆయనతోపాటు వెళ్లకుండా భరోసా ఇవ్వనున్నారు. ఇందుకోసం మండలాల వారీ టీమ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. టీపీసీసీ ముఖ్యనేతల నాయకత్వంలో ఈ బృందాలు గ్రామస్థాయిలో పనిచేయనున్నాయి. ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చి ఆ ఎన్నిక ముగిసేంతవరకు ఈ టీమ్‌లు క్రియాశీలకంగా పనిచేస్తాయని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.

వ్యక్తిగత విమర్శలు వద్దు: మునుగోడు నియోజకవర్గ స్థానిక నేతలతో టీపీసీసీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, నియోజకవర్గ వ్యూహకమిటీ సభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. టికెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్‌గౌడ్, పున్నా కైలాశ్‌ నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉప ఎన్నిక అనివార్యమైతే టికెట్‌ ఎవరికి ఇవ్వాలన్నది అప్పుడు నిర్ణయిద్దామని, స్థానిక నాయకులెవరూ వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని టీపీసీసీ నేతలు సూచించారు. పార్టీ కార్యకర్తతో పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఫోన్‌ కాల్‌ లీకైన నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి జాగ్రత్తలు చెప్పారు. టికెట్‌ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, సర్వేల ఆధారంగా గెలిచే అవకాశాలున్న వారికే టికెట్‌ వస్తుందన్నారు. 

నేడు కీలక భేటీలు
మునుగోడు ఉప ఎన్నికల ప్రణాళిక సమావేశం గురువారం గాంధీభవన్‌లో జరగనుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ప్రణాళిక కమిటీ కన్వీనర్‌ మధుయాష్కీగౌడ్, కమిటీ సభ్యులు ఉదయం 10:30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లతో సమావేశం జరగనుంది.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి
నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తతో తాను మాట్లాడిన ఫోన్‌ లీక్‌ కావడం ప్రత్యర్థుల కుట్రేనని, తనను ట్రాప్‌ చేయాలన్న ఆలోచనతోనే దీన్ని లీక్‌ చేశారని పాల్వాయి స్రవంతి చెప్పారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదని, తనకే మునుగోడు టికెట్‌ వస్తుందని ఆ కార్యకర్తకు భరోసా కల్పించేలా మాట్లాడానని పేర్కొన్నారు.
చదవండి: అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం

మరిన్ని వార్తలు