‘ఎన్నికల కమిషన్‌ నియంత్రణ కోల్పోయింది’

19 Oct, 2021 09:02 IST|Sakshi
మాట్లాడుతున్న మాణిక్కం ఠాగూర్‌

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎన్నికల సంఘం నియంత్రణ కోల్పోయిందని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. సోమవారం ఆయన హుజూరాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉపఎన్నికను తమపార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని అన్నారు. నగదు, మద్యం, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా ఎలక్షన్‌ కమిషన్‌ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌–బీజేపీ అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా.. స్పందించడం లేదని ధ్వజమెత్తారు. దసరా సందర్భంగా నియోజకవర్గంలో పంచిన తాయిలాలను పట్టించుకోలేదన్నారు. తామంతా యువకుడు, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి యువనేత బల్మూరి వెంకట్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపించేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. ఈ ఉప ఎన్నిక ద్వారా నిరుద్యోగ సమస్యల విషయంలో టీఆర్‌ఎస్‌ను, పెట్రోల్‌–డీజిల్, గ్యాస్‌ సిలిండర్‌ ధరల విషయంలో బీజేపీల తీరును హుజూరాబాద్‌ ప్రజల ముందు నిలదీస్తామన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఎలాంటి ఆశలు లేవన్నారు.

ఈ ఉప ఎన్నిక ఓడిపోతారని ముందే తెలిసే.. తమకు హుజూరాబాద్‌ ఫలితం చాలా చిన్న విషయం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని గుర్తుచేశారు. అంతా అనుకుంటున్నట్లుగా ఈ ఉప ఎన్నిక పోరు టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య కాదని, ఇది కాంగ్రెస్‌–బీజేపీల మధ్యేన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి డబ్బును హుజూరాబాద్‌ ఎన్నికల్లో పారిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం బీజేపీ–టీఆర్‌ఎస్‌లకు వంతపాడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఏమంటారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఠాగూర్‌ స్పందించారు.

వాస్తవానికి తమ కంటే ఆలస్యంగా బీజేపీ తన అభ్యర్థిని ఈటల రాజేందర్‌ అని ప్రకటించిందని గుర్తుచేశారు. నాలుగు నెలలుగా బీజేపీ–టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం విషయంలో మీపార్టీ వెనకబడిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు మాణిక్కం స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి చివరి పది రోజులు చాలని అన్నారు. తమకు ఇంకా 224 గంటల సమయం మిగిలి ఉందని, ఇది తాము శక్తిమేరకు ఈ సమరంలో పోరాడుతామని స్పష్టంచేశారు. ఈటల రాజేందర్, హరీశ్‌రావులు తమ అక్రమ సంపాదనను హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు.

అందుకే.. తాము ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని యువకుడు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు చేసిన విద్యార్థి నేత అయిన బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా పోటీలో దింపామన్నారు.అదే విధంగా నిరుద్యోగ సమస్యలో తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రతీ ఇంట్లో ఉన్న నిరుద్యోగుల సమస్యను ఎలుగెత్తి చాటుతామని వివరించారు. బీజేపీ– టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ఎద్దేవా చేశారు.

కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్, ఉప ఎన్నిక సమన్వయ కమిటీ చైర్మన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరి్సంహ, ప్రచార కమిటీ చైర్మన్‌ మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, మంథని, ములుగు శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సీతక్క, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌
     

మరిన్ని వార్తలు