కేసీఆర్‌ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది

23 Nov, 2023 10:01 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. 

ఇందిరమ్మ పాలనను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్‌ ఇచ్చారాయన. 

తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్‌ కాలేజ్‌, జేఎన్టీయూ, న్యాక్‌ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్‌రెడ్డి. 

మరిన్ని వార్తలు