బడా కార్పొరేట్ల రుణ మాఫీపై చర్చకు సిద్ధమా?: కాంగ్రెస్‌

13 Aug, 2022 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్‌ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్‌ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని మీడియాకు ఆయన వివరించారు. రద్దైన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్‌లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20% మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు. 

మరిన్ని వార్తలు