మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్

25 Nov, 2023 09:30 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో గెలుపుపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చే ధోరణికి ప్రజలు స్వస్తి పలకాలని చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధిస్తామని చెప్పారు. అభివృద్ధికి కట్టుబడి ఉండే వారికే ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ఓటు హక్కుని వినియోగించుకునే ముందు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలు సరైన తీర్పును ఇస్తారని భావిస్తున్నట్లు పైలెట్ చెప్పారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజస్తాన్‌ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్‌ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గురీత్‌సింగ్‌ కూనార్‌ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇదీ చదవండి: 'చైనా కొత్త వైరస్‌తో జాగ్రత్త'

మరిన్ని వార్తలు