సీఎం చన్నీని పక్కన పెడతారు

8 Feb, 2022 19:28 IST|Sakshi

పంజాబ్‌ ప్రచారంలో మాయావతి

తమ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి

చండీగఢ్‌: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 

పంజాబ్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్‌: పంజాబ్‌లో ఆప్‌ టెన్‌ పాయింట్‌ అజెండా)

బీఎస్‌పీ-ఎస్‌ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్‌లో బీఎస్‌పీ-ఎస్‌ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్‌బీర్ బాదల్‌ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్‌: పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!)

మరిన్ని వార్తలు