జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ మళ్లీ లేఖ

30 Aug, 2020 04:40 IST|Sakshi

బీజేపీ అనుకూల ఆరోపణలపై ఏం చేశారంటూ ఫేస్‌బుక్‌ సీఈవోకు ప్రశ్న

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి కాంగ్రెస్‌ పార్టీ మరోసారి లేఖ రాసింది. సంస్థకు చెందిన భారతీయ విభాగం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పదేపదే వస్తున్న ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించింది. ఫేస్‌బుక్‌ ఉద్యోగులు, అధికార బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇదే అంశంలో ఆగస్టు 17వ తేదీన కూడా జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. కొందరు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో నిబంధనలను ఫేస్‌బుక్‌ వర్తింపజేయలేదంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన కథనంపై దర్యాప్తు చేయించాలంటూ అప్పట్లో కోరామన్నారు.

‘ఆగస్టు 27వ తేదీన టైమ్‌ మ్యాగజీన్‌లో వచ్చిన తాజా కథనంలో ఫేస్‌బుక్‌ ఇండియా– అధికార బీజేపీ మధ్య క్విడ్‌–ప్రొ–కో లింకులున్నాయన్న ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారంతోపాటు ఆధారాలు కూడా ఉన్నాయి. 17వ తేదీన మేం రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరంగా తెలపాలని తాజా లేఖలో ఫేస్‌బుక్‌ను కోరాం’అని వేణుగోపాల్‌ వివరించారు.  కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా, ఏఐసీసీ డేటా అనలిస్టిక్స్‌ విభాగం చీఫ్‌ ప్రవీణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ సూచించే చర్యలను ఫేస్‌బుక్‌ అమలు పరిచే వరకు, విచారణ పూర్తయ్యేవరకు ఫేస్‌బుక్‌ ‘పేమెంట్‌ ఆపరేషన్స్‌’కు అనుమతి ఇవ్వరాదన్నారు.

భారత విభాగం ఉద్యోగులపై చేపట్టిన దర్యాప్తులో తేలిన విషయాలను ఫేస్‌బుక్‌ బహిర్గతం చేయాలని కూడా వారు కోరారు. టైమ్‌ మ్యాగజీన్‌ కథనంతో బీజేపీ–వాట్సాప్‌ సంబంధాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘వాట్సాప్‌కు 40 కోట్ల మంది భారతీయ వినియోగదారులున్నారు. ఈ యాప్‌ కూడా చెల్లింపుల వేదికగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదే అదనుగా వాట్సాప్‌పైనా బీజేపీ అదుపు సాధించింది’అని ట్విట్టర్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.  టైమ్‌ మ్యాగజీన్‌ కథనాన్ని జత పరిచారు.

మరిన్ని వార్తలు