హుజూరాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్‌.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు!

3 Feb, 2023 12:56 IST|Sakshi

హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అసమ్మతి గళం

బీజేపీతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

జమ్మికుంటలో బీజేపీని దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీతో జట్టు

మున్సిపల్‌ చైర్మన్‌వి ఏకపక్ష నిర్ణయాలంటూ రగడ

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వద్దకు చేరిన పంచాయితీ 

అదే బాటలో జమ్మికుంట మున్సిపల్‌ లొల్లి..? 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్‌ మున్సిపల్‌ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధికపై బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్‌ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. 

హుజూరాబాద్‌ నుంచి నేరుగా బీఆర్‌ఎస్‌కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్‌కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్‌ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం.

ఏకపక్ష నిర్ణయాల వల్లే...
హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్‌ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్‌ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చైర్‌పర్సన్‌కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. 

ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ..
25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్‌ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్‌ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. 

- గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్‌గా ఉన్న విజయ్‌కుమార్‌తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. 

చైర్‌పర్సన్‌ రేసులో ముగ్గురు..!
బీఆర్‌ఎస్‌–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్‌పర్సన్‌ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్‌ చైర్‌పర్సన్‌ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ కానుంది.

మరిన్ని వార్తలు