మంత్రులెందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరరు?!

3 Aug, 2020 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తనకు కరోనా సోకినట్లు ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే. ఆయన ప్రస్తుతం గురుగావ్‌లోని మేదాంత ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్‌షా ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఆస్పత్రి నుంచి ప్రత్యేక నిపుణుల బందం మంగళవారం గుర్గావ్‌కు వెళ్లనుంది. 

తనకు కూడా కరోనా సోకినట్లు ట్వీట్‌ చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప బెంగళూరులోని ప్రైవేటు మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నాడే తమిళనాడు గవర్నర్‌ బన్వారీ లాల్‌ పురోహిత్‌ ‘కావేరీ హాస్పిటల్‌’ అనే ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. గహ నిర్బంధంలో ఉండాల్సిందిగా ఆయనకు వైద్యులు సలహా ఇచ్చారు. (అమిత్‌ షా ఆ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు)

అంతకుముందు గత నెలలో, జూలై 15న కరోనాతో  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నడుస్తోన్న ‘రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరారు. ఆ మరుసటి రోజే ఆయన ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తోన్న ‘మాక్స్‌ హాస్పిటల్‌’లో చేరారు. జూలై 8వ తేదీన తమిళనాడు విద్యుత్‌ శాఖ మంత్రి పీ. తంగమణి కరోనాతో చెన్నైలో అపోలో హాస్పిటల్‌లో చేరారు. తమిళనాడు విద్యామంత్రి కేపీ అంబళగన్, సహకార శాఖా మంత్రి సెల్లూరు కే రాజు చైన్నైలోని ‘మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్థోపెడిక్స్‌ అండ్‌ ట్రామటాలోజి’ అనే ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే పంజాబ్‌ గ్రామీణ శాఖ మంత్రి తప్త్‌ సింగ్‌ భజ్వా మొహాలీలోని ‘ఫార్టీస్‌ హాస్పిటల్‌లో, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌లోని ‘చిరాయువు హాస్పిటల్‌’ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు. (సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్‌)

ఇలా కేంద్ర మంత్రులతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స కోసం చేరారు, చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ మంత్రి 62 ఏళ్ల కమల్‌ రాణి వరుణ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న లక్నోలోని ‘సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యువేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ కరోనా చికిత్స కోసం చేరారు. ఆమె ఆదివారం మరణించారు. వయస్సు, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆమె మరణించారా లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ కొరత వల్ల మరణించారా ?! అక్కడి ప్రభుత్వానికే తెలియాలి. (ప్రముఖులపై కరోనా పంజా)

కావాల్సినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత కూడా లేదని కేంద్రం మొదలుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రజలకు భరోసా కల్పించేందుకైనా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో చేరవచ్చుగదా! ఎందుకు చేరరు? మొదట్లో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులనే కేంద్రం ఆనుమతించలేదు. ఏదోరోజున తమకు కూడా కరోనా రాక తప్పదని భావించాకే పాలకులు ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించారా?!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు