ప్రత్యామ్నాయమా.. ఒంటరిపోరా!

15 Feb, 2023 03:58 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ కలిసిరాని పక్షంలో కార్యాచరణపై లెఫ్ట్‌ సమాలోచన 

బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామంటున్న వామపక్షాలు 

మఖ్దూం భవన్‌లో పొత్తులు, ప్రజా పోరాటాలపై నేతల కీలక భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం గందరగోళంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు మూడు పార్టీల మధ్య కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. బీఆర్‌ఎస్‌ కలిసిరాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, కుదరని పక్షంలో ఒంటరిగా పోటీ దిశగా వామపక్షాలు సమాలోచన చేస్తున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ మధ్య పొత్తు ఉంటుందని మునుగోడు ఎన్నికల సందర్భంగా కొందరు నాయకులు ప్రకటించినా, ఇప్పుడు దానిపై స్పష్టత కరువైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదనీ, ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని కొందరు బీఆర్‌ఎస్‌ నేతల ప్రచారంపై కామ్రేడ్లు మండిపడుతున్నారు.

‘మాది రాజకీయ పార్టీ. ప్రజా క్షేత్రంలో పోరాడిన చరిత్ర మాది. దేశంలో గతంలో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇప్పుడు కేరళలో అధికారంలో ఉన్నాం. జాతీయ స్థాయిలో కీలకమైన పార్టీలుగా ఉన్నాం. అలాంటి పార్టీలు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి నామినేటెడ్‌ పోస్టుల వరకే పరి మితం కాబోవు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. పొత్తు ఉన్నా లేకున్నా బరిలో ఉంటాం..’అని లెఫ్ట్‌కు చెందిన ఒక కీలకనేత వ్యాఖ్యానించడంతో పొత్తులు రసకందాయంలో పడ్డాయి.  

పొత్తులపై హాట్‌హాట్‌ చర్చ 
రాష్ట్రంలో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్‌ పార్టీలు భావిస్తున్నాయి. పొత్తులు, ప్రజాసమస్యలపై పోరాటాలు వంటి అంశాలపై సీపీఐ, సీపీఎం  నేతలు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో పాటు ఆ పార్టీకి చెందిన పశ్య పద్మ, చాడ వెంకటరెడ్డి తదితరులు.. సీపీఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొత్తులపై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ‘మేం చెరో 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం. ఆ మేరకు బీఆర్‌ఎస్‌కు ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నాం. ఆ పార్టీతో జరిగే చర్చల్లో అటుఇటుగా పొత్తుకు సిద్ధం అవుతాం. ఒకవేళ బీఆర్‌ఎస్‌ మాకు గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాం. బీజేపీకి అడ్డుకట్ట వేసే మరో పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలిస్తాం.

కుదరకపోతే ఒంటరిగానైనా పోటీ చేస్తాం. అప్పుడు అవసరమైతే చెరో 20 స్థానాల్లోనూ పోటీ చేసి తీరతాం’అని ఆ చర్చల్లో పాల్గొన్న ఒక నేత స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో పరస్పర ఐక్యత ప్రదర్శించాలని రెండు పార్టీలు స్పష్టమైన అవగాహనకు వచ్చాయి. ఎక్కడా ఒకరిపై మరో పార్టీ పోటీకి పెట్టకుండా ఉండాలని నిర్ణయించాయి. కాగా బీఆర్‌ఎస్, కామ్రేడ్ల మధ్య సాగుతున్న ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆసక్తిగా పరిశీలిస్తోంది. 

ప్రజా సమస్యలపై పోరాటాలు 
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కలిసి పనిచేయా లని కూడా సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ మేరకు మార్చి నెలలో ప్రజా పోరాటాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తేనున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ సహా పలు అంశాలపై ఐక్య పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించాయి.  

మరిన్ని వార్తలు