మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?

29 Nov, 2022 15:21 IST|Sakshi

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్‌తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? 

ఇదే అదను, దిగాలి బరిలోకి
ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో‌ సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన  సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. 

 మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి?
మునుగోడులో అధికార టీఆర్ఎస్‌కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి.‌ బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్‌, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం‌.‌ తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది.
చదవండి: ఫాంహౌజ్‌ ఎపిసోడ్‌ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?

జూలకంటి రెఢీ
ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని‌ టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. 

మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు