కమ్యూనిస్టుల భయంతోనే సైన్యాన్ని పంపించారు 

18 Sep, 2022 01:45 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న సురవరం. చిత్రంలో కూనంనేని, కోదండరాం, నారాయణ, చాడ, అజీజ్‌పాషా 

సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం 

నాడు పోరాటంలో లేని బీజేపీ ఇప్పుడు విమోచన ఉత్సవాలు చేస్తోందని ఎద్దేవా 

సీపీఐ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు  

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): తెలంగాణ విమోచనం పేరుతో బీజేపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులు అయితే.. నేడు ఉత్సవాలు చేస్తుంది పోరాటంలో లేని బీజేపీ అని పేర్కొన్నారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సురవరం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి 3 వేల గ్రామాలను విముక్తం చేసిన కమ్యూనిస్టులు కొద్ది నెలల్లో తెలంగాణ ప్రాంతమంతా విస్తరిస్తారన్న భయంతో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ సైన్యాన్ని హైదరాబాద్‌కు పంపించారన్నారు. భారత సైన్యం రావాలనుకుంటే.. 1947లోనే ఎందుకు రాలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రజాకార్లు అరాచకాలు చేసినప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుండా తెలంగాణ పోరాటం జరిగిందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 17వ తేదీ.. విమోచనం కాదని విలీనమే సరైన పదమని స్పష్టం చేశారు.  

చరిత్ర వక్రీకరణ యత్నాన్ని అడ్డుకోవాలి : ప్రొఫెసర్‌ కోదండరాం  
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణకు జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహించినట్టుగానే ప్రతిసంవత్సరం నిర్వహించాలని సూచించారు. సీపీఐ నేతలు కె.నారాయణ, చాడా వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, ఓయూ ప్రొఫెసర్‌ ఖాసీం, స్వతంత్ర సమరయోధుడు మొయునుద్దీన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, సీపీఐ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు